Hyderabad Rains News: హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలు మేడ్చల్ జిల్లాలోని గండి మైసమ్మ ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపాయి. గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లు అన్నీ జలమయం కాగా, గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మ గూడలో వరద నీరు మొదటి అంతస్తులోకి సైతం చేరింది. ఆ ప్రాంతంలో ఉన్న అపార్టుమెంట్లలో ప్రైవేటు హాస్టల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ హాస్టల్స్‌ మొదటి అంతస్తులోకి వరదనీరు రావడంతో సుమారు 15 అపార్ట్‌మెంట్లు నీటిలో చిక్కుకుపోయాయి. దీంతో ఆ ప్రాంతం చెరువును తలపించింది. వరద కారణంగా ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో ఆందోళన చెందుతున్న విద్యార్థులను మరోచోటుకు తరలించే ప్రయత్నం చేశారు. పొక్లెయినర్లను అక్కడికి తీసుకొచ్చి, బాల్కనీ గుండా విద్యార్థులను అందులో ఎక్కించుకొని మరో చోటికి తరలించారు. సదరు ప్రాంతంలో కాలువలు, కుంటలను కబ్జా చేసి చాలా భవనాలు అక్రమంగా నిర్మించారని, అందుకే ఈ దుస్థితి వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


హైదరాబాద్ లో పడుతున్న భారీ వర్షాల కారణంగా వాతావరణ విభాగం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. హైదరాబాద్ నగరం సహా శివారుల్లోని పలు కాలునీలు నీట మునిగి చెరువుల్ని తలపిస్తున్నాయి. జలాశయాలకు నీరు పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తుగానే ఖాళీ చేయిస్తున్నారు.


బయటికి రావద్దని సూచనలు


ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. భారీ వర్షాల వేళ జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, ట్రాన్స్ కో ఎండీ, ఈవీడీఎం డైరెక్టర్, హైదరాబాద్‌ కలెక్టర్‌తో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు.  ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. చెట్లు, కొమ్మలు, కూలిన చోట నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించారు.


కంట్రోల్ రూం నెంబర్లు ఇవే


హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్‌ నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర సేవలకు జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్లు 040-21111111, 23225397లో సంప్రదించాలన్నారు. 


విద్యుత్ అంతరాయాల ఫిర్యాదుల కోసం


ప్రజలు ఇళ్ల వద్ద అప్రమత్తంగా వ్యవహరించాలని ట్రాన్స్ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా విద్యుత్‌ సరఫరా పరిస్థితిపై అధికారులతో ట్రాక్స్‌కో సీఎండీ సమీక్షి నిర్వహించారు. విద్యుత్‌ పరికరాలకు, విద్యుత్‌ తీగలకు దూరంగా ఉండాలని...బయటకు వెళ్లినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఎక్కడైనా విద్యుత్‌ తీగలు తెగిపడితే వెంటనే సిబ్బందికి చెప్పాలని లోతట్టు ప్రాంతాలు, భవనాల సెల్లార్లలో నీరు చేరితే సమాచారం ఇవ్వాలని కోరారు.  అందించాలని కోరారు. ఏవైనా సమస్యలు కోసం 1912, 738207214, 7382072106, 7382071574 నంబర్లలో ఫిర్యాదు చేయోచ్చని తెలిపారు. విద్యుత్‌ సమస్యలను వాట్సప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా కూడా చెప్పవచ్చని వెల్లడించారు.