Heavy Rains In Hyderabad: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, నైరుతి రుతుపవనాలు కారణంగా తెలంగాణలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం నుంచి ఏకధాటిగా వానలు పడుతూనే ఉన్నాయి. నగరం నలుమూలల కుండపోత వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. 



హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల ప్రజలు నిబ్బంది పడుతున్నారు. నీరు నిలిచిపోయి ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మారేడ్‌పల్లిలోని న్యూ మెట్టుగూడలో అత్యధికిగా 7.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. యూసఫ్‌గూడలో 7.65, జూబ్లీహిల్స్‌లో 7.2, శేరిలింగపల్లి, మాధాపూర్‌లో 6.95, నాచారం, సీతాఫల్‌మండిలో 6.85 సిటీ శివారుల్లో 5.20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. 


ఓవైపు జోరువాన పడుతుంటే... ట్రాఫిక్ జామ్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలే ఆదివారం, సాయంత్రం మరింత ట్రాఫిక్ జామ్‌ అయింది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో జనాలు పడిన ఇబ్బందులు అంతా ఇంతా కాదు. గంటల తరబడి వర్షానికి రోడ్డుపైనే జాగారం చేయాల్సి వచ్చింది. అధికారులు అప్పటికప్పుడు అప్రమత్తమై ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో పడినప్పటికీ ఆలస్యమైంది. 








జీహెచ్‌ఎంసీ అధికారులు పలు ప్రాంతాల్లో పర్యటించి మ్యాన్స్‌ హోల్స్‌ క్లియర్ చేయించారు. క్యాచ్ పిట్స్‌, నీటి నిలిచిన ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జోరువాన ఈ పనులకు ఆటంకంగా ఏర్పడింది. 






హైదరాబాద్ మేయర్‌ విజయలక్ష్మి కూడా అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భారీ వర్షాలు కురుస్తున్న వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు పొంచి ఉన్న ప్రాంతాలపై ఫోకస్ చేయాలని ఆదేశించారు. ప్రజల ప్రయాణాలకు ఆటంకం లేకుండా వారి ప్రాణాలకు ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, మ్యాన్ హోల్స్ ఉన్న ప్రాంతాల్లో సూచిక బోర్డులు పెట్టాలన్నారు. 






మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలియజేశారు. ఆవర్తనం, నైరుతి ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు చెప్పారు. బయటకు వెళ్లేటప్పుడు, వర్షాలు పడే సమయంలో మ్యాన్స్ హోల్స్, మురికి కాలువలను గమనించి వానాలు నడపాలని, నడవాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు పడే సమయంలో ఎవరూ బయటకు రావద్దని అత్యవసరమైతే తప్ప రోడ్డుపై తిరొగద్దని సూచిస్తున్నారు.