Banjara Hills CI Suspended in Late Night Party Case: బంజారాహిల్స్‌లోని పబ్‌లో లేట్ నైట్ వరకూ జరిగిన పార్టీ వ్యవహారంలో పోలీసులపై వేటు పడింది. బంజారాహిల్స్ సీఐను సస్పెండ్ చేయడంతో పాటు ఏసీపీకి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మెమో జారీ చేశారు. అర్ధరాత్రి దాటి తెల్లవారు జామున 3 గంటల వరకూ జరుగుతున్న ఈ పార్టీలో డ్రగ్స్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలు లభ్యం కావడాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారంతో పోలీసులపై తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోనే ఈ పబ్‌ ఉందని.. గతంలో దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పార్టీలో డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాలు లభ్యం కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.


గతంలో కూడా ఈ పబ్‌ గురించి స్థానికుల నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు వచ్చినా ఆ పోలీసుల చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో బంజారాహిల్స్‌ సీఐ శివచంద్రను (Banjara Hills CI) సీపీ సీవీ ఆనంద్‌ వెంటనే సస్పెండ్‌ చేశారు. మరోవైపు ఏసీపీ సుదర్శన్‌కు కూడా ఛార్జిమెమో జారీ చేశారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఏసీపీని సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు.


కొనసాగుతున్న దర్యాప్తు
మరోవైపు, బంజారాహిల్స్‌లోని పబ్ పార్టీ కేసులో (Banjara Hills Pub Party) ముమ్మరంగా దర్యాప్తు సాగుతోంది. పోలీసులు 150 మంది యువతీ యువకుల ప్రమేయంపై విచారణ చేస్తున్నారు. పోలీసులు ఆకస్మికంగా రైడ్స్ వెళ్లిన సమయంలో డ్రగ్స్ ప్యాకెట్లను కొందరు కింద పారేయగా, మరికొంత మంది కిటికీ నుంచి విసిరేశారు. ముఖ్యంగా ఆ డ్రగ్స్ ఎవరికోసం ఎవరు తెచ్చారు అనే కోణంలో విచారణ సాగుతోంది. పార్టీలో పాల్గొన్న మొత్తం 150 మంది యువతీ యువకుల ఇంటి అడ్రస్‌లు, ఫోన్ నెంబర్‌లు తీసుకుని నోటీస్‌లు పోలీసులు వారిని పంపేశారు. ఇదే సమయంలో ప్రముఖుల పిల్లలతో పాటు మరికొందరి శాంపుల్స్ కూడా పోలీసులు సేకరించారు.


విచారణలో భాగంగా తొలుత పబ్ నిర్వహకులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకురాగా, వారిని మళ్లీ పోలీసులు పీఎస్ నుండి పబ్‌కి తరలించారు. ఇద్దరు పబ్ నిర్వహకులను పబ్ కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. లోపల మరింత అనుమానిత డ్రగ్ ఉందన్న సమాచారం మేరకు సోదాలు కొనసాగుతున్నాయి. పబ్ బాత్ రూమ్ గదుల్లో డ్రగ్స్ వాడి వదిలేసిన ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.