హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని హోటల్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలోనూ నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ను నిర్వహిస్తుండడంతో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ రాడిసన్ పబ్‌లో డ్రగ్స్‌ను సైతం పట్టుకున్నారు. 6 గ్రాముల కొకైన్‌ సీజ్ చేశారు. పోలీసుల దాడులతో బెంబేలెత్తి పరుగులు తీసిన యువతీ యువకులు డ్రగ్స్‌తో దొరికిపోతామనే భయంతో పబ్‌లో ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్ ప్యాకెట్లను పడేశారు. బాత్ రూమ్, డ్యాన్స్ ఫ్లోర్లలోనూ డ్రగ్స్ ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొకైన్‌, గంజాయి, కొన్ని రకాల డ్రగ్స్‌, ఎల్‌ఎస్‌డీతో ఉన్న సిగరెట్లను పోలీసులు గుర్తించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. తమ అదుపులో ఉన్న యువతీ యువకుల నుంచి పోలీసులు వివరాలను సేకరించిన అనంతరం వారిని వదిలిపెట్టారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పబ్‌ యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.


సీఐ సస్పెండ్!
అయితే, ఈ పబ్‌ ఒక మాజీ ఎంపీ కుమార్తెదిగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం తిరిగి తిరిగి పోలీసుల మెడకు చుట్టుకుంటోంది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న రాడిసన్ పబ్‌లో గతంలో స్థానికులు ఫిర్యాదు చేసినా బంజారాహిల్స్ పోలీసులు పట్టించుకోలేదని తెలుస్తోంది. అందుకే బంజారాహిల్స్ పోలీసులు ఇన్నాళ్లూ చూసి చూడనట్లు వదిలేసినట్టు సమాచారం. రాత్రి మూడు గంటలు వరకూ పబ్ నడిచినా పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలోనే బంజారాహిల్స్ సీఐ శివ చంద్ర సస్పెండ్ అయినట్లుగా తెలుస్తోంది. ఏసీపీ సుదర్శన్‌ ఆయనకు మెమో జారీ చేశారని సమాచారం.


పట్టుబడ్డ వారిలో నిహారిక సహా ప్రముఖులు!
రాడిసన్ బ్లూ పబ్ నుంచి మొత్తం 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వీరిలో 99 మంది యువకులు, 39 మంది యువతులు, 19 మంది పబ్‌ సిబ్బంది ఉన్నారు. పట్టుబడిన వారిలో బిగ్ బాస్ విజేత, ఆర్ఆర్ఆర్‌‌లో ‘నాటు నాటు’ పాట పాడిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నాగబాబు కుమార్తె నిహారిక, గల్లా జయదేవ్ కుమారుడు, మాజీ డీజీపీ కూతురు, హేమ తదితరుల పేర్లు బయటికి వచ్చినప్పటికీ కచ్చితమైన స్పష్టత లేదు. దీనిపై పోలీసులు అధికారిక ప్రకటన జారీ చేయాల్సి ఉంది.

కానీ, కొణిదెల నిహారిక పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తున్నట్లు రెండు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. మీడియా ప్రతినిధులు ఆమెను చుట్టుముట్టి స్పందించాలని కోరగా, ఆమె ఫోన్లో మాట్లాడుకుంటూ నెంబరు ప్లేటు లేని కారులో వెళ్లిపోయారు. రాహుల్ సిప్లిగంజ్ పార్టీలో ఉన్న వీడియో కూడా బయటకు వచ్చింది.



గల్లా కుటుంబ సభ్యుల ఖండన
పోలీసులు జరిపిన రైడ్‌లో గల్లా అశోక్ పేరు కూడా జత చేసి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయని.. ఈ వ్యవహారంలో గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదని ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. నిరాధారమైన వార్తలని మీడియాలో ప్రసారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారు.