తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అందుకు తగ్గ ట్రైనింగ్ తీసుకొనే స్తోమత మీకు లేదా? అయితే, అలాంటి వారి కోసం రాచకొండ పోలీసులు అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు పొందాలనుకునే యువతీ, యువకులకు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్‌ 5 సాయంత్రం 6 గంటల్లోపు తమకు దగర్లోని పోలీస్‌ స్టేషన్‌లో పేర్లను నమోదు చేసుకోవచ్చు.


అందుకోసం పదో తరగతి, ఇంటర్మీడియట్‌ మార్కుల మెమోలు, ఆధార్‌ కార్డు, రెసిడెన్స్, కుల ధ్రువీకరణ పత్రాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. పురుషులు 167.6 సెంటీ మీటర్లు, మహిళలు 152.5 సెంటీ మీటర్లకు పైబడి ఎత్తు ఉన్నవారు మాత్రమే అర్హులని పోలీసులు వెల్లడించారు. స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కింది ట్వీట్‌లో పేర్కొన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కూడా అభ్యర్థులు తమ పేరును నమోదు చేసుకోవచ్చని రాచకొండ పోలీసులు ట్వీట్ చేశారు.


ఈ శిక్షణ కార్యక్రమం రంగారెడ్డి, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు, స్వచ్చంద సంస్థలు, దాతల సహాయంతో జరుగుతోంది. మల్కాజిగిరి, కుషాయిగూడ, భువనగిరి, చౌటుప్పల్‌, ఎల్బీ నగర్‌, ఇబ్రహీంపట్నం ప్రాంతాలలో ట్రైనింగ్ సెంటర్లు పెట్టనున్నారు. గతంలో రాచకొండ పోలీసులు ఉచిత కోచింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దాదాపు 588 మంది పోలీసు ఉద్యోగాలు వచ్చాయి.






ఖాళీలు ఇవీ..
తెలంగాణలో పోలీసు శాఖకు సంబంధించి 16,587 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీచేసింది. ఇందులో కానిస్టేబుల్ (Civil) - 4,965, కానిస్టేబుల్ (AR) - 4423, కానిస్టేబుల్ (IT&C) - 262, టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ (TSSP) - 5704, కానిస్టేబుల్ (Driver) PTO - 100, కానిస్టేబుల్ (మెకానిక్) PTO - 21, కానిస్టేబుల్ (SARCPL) - 100 ఉన్నాయి.


ఇంకా సబ్ ఇన్ స్పెక్టర్ (Civil) - 415, రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (టీఎస్ఎస్పీ) - 23, రిజర్వ్ సబ్ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్ పోలీస్ (AR) - 69, సబ్ ఇన్ స్పెక్టర్ (PTO), సబ్ ఇన్ స్పెక్టర్ (IT&C) - 23, రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SARCPL) - 05 ఉన్నాయి.