హైదరాబాద్ బంజారాహిల్స్‌లో హోటల్ రాడిసన్ బ్లూ ప్లాజాలోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌ డ్రగ్స్ పార్టీ వ్యవహారం కేసు విచారణలో భాగంగా కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని నిందితులుగా గుర్తించగా, ఇద్దరిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు పోలీసులు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అయితే, పార్టీకి వచ్చిన వారిలో డ్రగ్స్ వాడిన వారిని గుర్తించడంతోపాటు, అవి అక్కడికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర ఎవరెవరు పోషించారో పోలీసులు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. 


ఆ టేబుల్స్‌పై ఎవరెవరు కూర్చున్నారు


అయితే, పబ్‌లో ముఖ్యంగా మూడు టేబుళ్లపైన పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఆ మూడు టేబుళ్లపై బర్త్ డే పార్టీ జరిగిందని సమాచారం. ఆ టేబుళ్ల మీద పార్టీ చేసుకున్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ కెమెరాల దృశ్యాలను సేకరించారు. వాటిని విశ్లేషించే పనిలో ఉన్నారు. ఇరుకు గది కావడం, మొత్తం చీకటి ఉండటంతో వారి గుర్తింపు పోలీసులకు కష్టంగా మారింది. అసలు వారంతా తీసుకున్న డ్రింక్‌లో ఏం కలిసిందనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. నిందితులు అభిషేక్ ఉప్పల, అనిల్‌ కుమార్‌లను కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపితే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.


వెలుగులోకి అభిషేక్ ఫోటోలు
పబ్ డ్రగ్స్ కేసులో ఏ-2 గా ఉన్న అభిషేక్ ఉప్పల గతంలో పలువురు సెలెబ్రిటీలతో సన్నిహితంగా దిగిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అభిషేక్ ఫోన్ కాల్ డేటా కీలకంగా మారింది. హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులతో అభిషేక్‌కు బాగా పరిచయాలు ఉండడంతో అభిషేక్ ఉప్పల కాల్ డేటా, వాట్సాప్ ఛాటింగ్ తదితర వివరాలు కీలకంగా మారాయి. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దీంతో అభిషేక్‌కు ఉచ్చులో పడుతున్నట్లుగా తెలుస్తోంది.


ఆ పని చేయొద్దని శారద వేడుకోలు


మరోవైపు, సోమవారం అభిషేక్ తల్లి అభిషేక్ తల్లి ఉప్పల శారద మీడియాతో మాట్లాడారు. తన కొడుకు అభిషేక్‌పై దుష్ప్రచారం చేయొద్దని, అతనికి ఏమీ తెలీదని అన్నారు. పార్టీలో 148 మందిలో డ్రగ్స్‌ ఎవరు తెచ్చారో కనిపెట్టకుండా తన కొడుకు అభిషేక్‌ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తన కొడుకుపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్‌ కేసును తన కొడుకును మీదకు నెట్టవద్దని వేడుకున్నారు. పోలీసులు ముందు డ్రగ్స్ తెచ్చినవారిని అరెస్ట్‌ చేయాలని అభిషేక్ తల్లి శారద డిమాండ్ చేశారు.