తెలంగాణ(Telangan)లో ఆయా పార్టీల్లో ఉన్న ముఖ్యమైన నాయకులను ఆకర్షించే పనిలో ఉంది బీజేపీ(BJP). ముఖ్యంగా టీఆర్‌ఎస్‌(TRS)లో అసంతృప్తితో సైలెంట్‌గా ఉన్న వారిపై కన్నేసింది. అందులోభాగంగా సీనియర్ నేత, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ కమలం గూటికి చేరారు. తన అనుచరులతో కలిసి తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ తరుణ్ చుగ్, పార్టీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌ సమక్షంలో బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ నేతలు, నల్లగొండ నేతలు పాల్గొన్నారు. 


తెలంగాణలో కేసీఆర్‌ పాలనతో ప్రజలు విసిగిపోయారని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్‌ఎస్‌ను ఇంటికి పంపించేందుకు అంతా సిద్ధంగా ఉండాలన్నారు. అందుకు ప్రజలు కూడా సహకరిస్తున్నారని అభిప్రాయపడ్డారు బండి సంజయ్. ఇది గమనించిన చాలా మంది నేతలు బీజేపీవైపు చూస్తున్నారని.. భవిష్యత్‌లో ఇంకా చాలా మార్పులు జరుగుతాయన్నారు. 







బీజేపీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు భిక్షమయ్య గౌడ్‌. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉంటుందనే ఉద్దేశంతోనే 2019లో టీఆర్‌ఎస్‌లో చేరానని కానీ అక్కడ తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి సాధిస్తోందని.. తెలంగాణలో కూడా అలాంటి పాలన రావాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు భిక్షమయ్య గౌడ్. 






కాంగ్రెస్‌లో నాయకుడిగా ఎదిగిన భిక్షమయ్య గౌడ్‌... రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014, 2018లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునీత చేతిలో ఓడిపోయారు. 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఇన్నేళ్లు గడిచిన టీఆర్‌ఎస్‌లో సరైన గుర్తింపు లేని కారణంగా కారు దిగి కమలంతో ప్రయాణం మొదలు పెట్టారు.