Navaratri Celebrations: ఉత్తరాదిన నవరాత్రి ఉత్సవాలను ఎంత సంబరంగా, ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నవరాత్రి 9 రోజులు దుర్గా దేవిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రజలు ఉంటారు. ఆ సమయంలో చాలా మంది మాంసాహారం జోలికి అస్సలు పోరు. ఈ నవరాత్రుల్లో ఎంతో నిష్ఠతో దుర్గాదేవిని పూజిస్తూ ప్రసన్నం చేసుకుంటారు. ఇప్పుడు శ్రీరామ నవమిని కూడా ఉత్తరాదిలో అంతే భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. రామ నవమికి కొద్ది రోజుల ముందు నుంచే ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఢిల్లీ మేయర్ తాజాగా చేసిన ఆదేశాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.


ఈ నవరాత్రిని పురస్కరించుకుని ఢిల్లీలోని ఆలయాలకు సమీపంలోని బహిరంగ ప్రదేశాల్లో మాంసం విక్రయించే దుకాణాలను మూసివేయాలని (Meat Shops Close in Delhi) ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ముఖేష్ సూర్యన్ ఆదేశించారు. సౌత్ ఢిల్లీ మేయర్ సుందర్ అగర్వాల్ కూడా ఇదే తరహాలో ఆదేశాలిచ్చారు. నవరాత్రి సమయంలో మాంసం దుకాణాలు మూసి ఉంచితే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు చేసుకోవచ్చని వారు అన్నారు.


‘‘నవరాత్రి రోజులలో ప్రజలు తమ కుటుంబ సభ్యులతో పాటు దేవుడి ఆశీర్వాదం పొందడానికి ఆలయాలకు వెళ్తారు. ఈ రోజుల్లో ప్రజలు పవిత్రంగా ఉండేందుకు తమ ఆహారంలో ఉల్లిపాయలు, వెల్లుల్లిని ఉపయోగించడాన్ని కూడా మానేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో లేదా దేవాలయాల సమీపంలో మాంసాన్ని విక్రయించడం వారికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది.”అని సౌత్ ఢిల్లీ మేయర్ ముఖేష్ సూర్యన్ తన లేఖలో పేర్కొన్నారు.


దీనిపై హైదరాబాద్ ఎంపీ, AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) దీటుగా స్పందించారు. మాంసం కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారం మాత్రమే అని అన్నారు. మాంసం విక్రయాలపై ఆంక్షలు సరికాదని ట్వీట్ చేశారు. ‘‘ప్రధాని మోదీ బడా పారిశ్రామికవేత్తలకు ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ కల్పించాలని అనుకుంటున్నారు. సైద్ధాంతిక వ్యక్తుల్లో మతోన్మాదం కల్పించాలని చూస్తున్నారు. కానీ, మాంసం దుకాణాలు మూసేయడం వల్ల వారికి ఆదాయం పోతుంది. ఎవరు ఆదుకుంటారు? మాంసం అశుద్ధమైనది ఏమీ కాదు, అది వెల్లుల్లి లేదా ఉల్లిపాయ లాంటి ఆహారం మాత్రమే. 99 శాతం మంది మాత్రమే కాదు. 100 శాతం మంది ప్రజలు తమకు ఇష్టం లేకపోతే మాంసాన్ని కొనుగోలు చేయరు.’’ అని ట్వీట్ చేశారు.