Old Woman Transfers Assets to Rahul Gandhi: రాజకీయ నాయకులపై అభిమానం ఉండడం సహజమే. కానీ, ఈమెకు ఉన్న అభిమానం మాత్రం ఇంకో స్థాయిని చేరింది. ఎంతలా అంటే.. తన మొత్తం ఆస్తులన్నింటినీ రాసిచ్చేంతగా. ఇదేదో తమాషా అనుకునేరు! ఈ ఘటన నిజంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. 78 ఏళ్ల వయసున్న ఓ పెద్దావిడ తన మొత్తం ఆస్తిని తమ అభిమాన నాయకుడైన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీకి ధార పోసేసింది. తన ఆస్తిని ఆయన పేరు మీద రాసేసి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.


కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపైన తనకు ఉన్న అమితమైన అభిమానాన్ని 78 ఏళ్ల వయసున్న ఓ బామ్మ ఇలా చాటుకున్నారు. తనకున్న ఆస్తులన్నంటినీ రాహుల్‌ పేరు మీద రాసిచ్చారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ అవసరం ఇప్పుడు దేశానికి ఎంతగానో ఉందని అన్నారు. ‘‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాహుల్‌ గాంధీ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఆయన అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఈ దేశానికి చాలా అవసరం. అందుకే నేను మరణించిన తర్వాత నా ఆస్తులన్నింటినీ రాహుల్‌ గాంధీకే చెందేలా వీలునామా రాశాను. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పాను’’ అని పుష్ప ముంజియాల్ అన్నారు.


ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్‌కు చెందిన 78 ఏళ్ల పుష్ప ముంజియాల్‌ కాంగ్రెస్ సిద్ధాంతాలను బాగా నమ్ముతారు. ఆ పార్టీ భవిష్యత్తు లీడర్ అయిన రాహుల్ గాంధీని విపరీతంగా ఆరాధిస్తారు. అందుకే తన పేరు మీదున్న 50 లక్షల విలువైన ఆస్తులు, 10 తులాల బంగారం మొత్తం రాహుల్‌ గాంధీకి చెందేలా వీలునామా రాశారు. అందుకోసం ఆమె సోమవారం ఉత్తరాఖండ్ పీసీసీ మాజీ చీఫ్‌ ప్రీతమ్‌ సింగ్‌ నివాసానికి వెళ్లి.. రాహుల్‌ గాంధీ పేరు మీదకు తన తదనంతరం ఆస్తులు బదలాయించేలా తయారు చేసిన వీలునామాను అందజేశారు. ఈ వీలునామాను కోర్టులో కూడా ఇచ్చారు. ఈ వీలునామా పత్రాన్ని చూసి తొలుత కాంగ్రెస్‌ నేతలు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పట్ల, రాహుల్ గాంధీ పట్ల ఆ బామ్మకు ఉన్న ప్రేమకు ఫిదా అయిపోయారు. 


ఈ పరిణామంపై స్థానిక కాంగ్రెస్ మెట్రోపాలిటన్ ప్రెసిడెంట్ లాల్ చంద్ శర్మ మాట్లాడుతూ.. పుష్ప ముంజియాల్ పూర్తిగా ఇష్టపూర్వకంగానే తన ఆస్తుల్ని రాహుల్ గాంధీకి రాసిచ్చేలా వీలునామా రాశారని చెప్పారు.