గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు మళ్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన్ను ఇంకోసారి అరెస్ట్‌ చేయడానికి రెడీ అయ్యారు. దీంతో రాజాసింగ్ తన లాయర్లతో చర్చలు జరుపుతున్నారు. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌ సహా శాయినాథ్‌ గంజ్ పీఎస్‌లలో నమోదైన కేసులలో పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. 41 (ఏ) సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. యూపీ ఎన్నికల సమయంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఈ కేసులు నమోదు అయ్యాయి. మంగళ్‌హట్‌ పీఎస్‌లో 68/2022 క్రైమ్‌ నంబర్‌ కేసులో, షాహినాయత్‌గంజ్‌ పీఎస్‌లో క్రైమ్‌ 71/2022లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 


ఈ నోటీసులు జారీ అవ్వడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనను మళ్లీ అరెస్ట్‌ చేయడానికి పోలీసులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పాత కేసులకు సంబంధించి 41(A) సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారని, ఏప్రిల్‌ ఘటనకు సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని రాజా సింగ్ నిలదీశారు.


హోం మంత్రి మహమూద్ అలీ వార్నింగ్
ఇక, రాజాసింగ్‌ వ్యాఖ్యలపై తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ స్పందించారు. హోం మంత్రి మహమూద్‌ అలీ గురువారం విలేకరులతో మాట్లడుతూ.. నగరంలో శాంతియుతంగా ఉన్న వాతావరణాన్ని బీజేపీ పాడు చేస్తోందని అన్నారు. రాజాసింగ్ వ్యాఖ్యల వల్లే హైదరాబాద్‌లో శాంతి భద్రతల సమస్య ఏర్పడిందని అన్నారు. బీజేపీ లీడర్లు రౌడీయిజం చేస్తే సహించేది లేదని.. బీజేపీ అయినా, ఎంఐఎం అయినా తప్పు చేస్తే ఎవరినీ వదిలేది లేదంటూ మహమూద్ అలీ వార్నింగ్ ఇచ్చారు.


ఆ వీడియో వల్లే ఇటీవల అరెస్టు
ఓ వర్గానికి చెందిన వారి మనోభావాలను కించ పరిచే విధంగా వీడియో పోస్టు చేయడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు ఆ వీడియోను పోలీసులు తొలగింప చేశారు. రాజాసింగ్‌పై కేసు పెట్టి ఈనెల 23న అరెస్ట్ చేశారు. సాయంత్రం వరకూ విచారణ చేసి.. నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. మొదట ఆయనకు రిమాండ్ విధించినట్లుగా ప్రచారం జరిగింది. కానీ పోలీసులు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా అరెస్ట్ చేసిన విషయాన్ని రాజాసింగ్ లాయర్ హైలెట్ చేశారు. రాజాసింగ్ లాయర్ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. దీంతో రాజాసింగ్ విడుదల అయ్యారు. తాజాగా మరోసారి పోలీసులు రాజాసింగ్ కు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.


మూలం ఆ షో నే..


ఇటీవల హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనకు అనుమతి ఇవ్వవొద్దని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఆయన గతంలో హిందూ దేవుళ్లను అవమానిస్తూ స్టాండప్ కామెడీ చేశారని.. అందుకే ప్రదర్శనకు అంగీకరించబోమని అన్నారు. అయితే కేటీఆర్ ప్రత్యేక ఆహ్వానం మీద మునావర్ షో ఇవ్వడానికి వచ్చినందున పోలీసులు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని షోను సక్సెస్ చేశారు. రెండు రోజుల పాటు రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. అయితే తమ కార్యకర్తలు టిక్కెట్లు కొన్నారని, మునావర్‌ను కొడతామని, వేదికను తగలబెడతామని హెచ్చరించారు. దానికి ప్రతీకారంగానే ఆయన వీడియో పెట్టినట్లుగా తెలుస్తోంది.