కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రైవేటు బస్సులో 2 కిలోల నగలు ఉన్న ఓ సంచి చోరీకి గురి కావడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ముంబయి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన జబ్బర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో ఈ ఘటన జరిగింది. నగల వ్యాపారి వద్ద నమ్మకంగా పని చేసే ఓ వ్యక్తి 2 కిలోల బంగారు ఆభరణాలను ముంబయి నుంచి హైదరాబాద్‌కు చేరవేసే క్రమంలో చోరీ జరిగింది. దీంతో అతను పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ కేసులో పోలీసులు అసలు విషయాన్ని గుర్తించి పోయిన 2 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.


నమ్మకంగా యజమాని వద్ద పని చేసిన వ్యక్తే ఈ చోరీకి పాల్పడ్డట్లుగా పోలీసులు వెల్లడించారు.వ్యసనాలకు అలవాటు పడి, చేసిన అప్పులు తీర్చేందుకు నమ్మిన యజమానికే శఠగోపం పెట్టాడని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ఇద్దరిని పంజాగుట్ట క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. కమిషనరేట్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ అంజనీ కుమార్‌ ఈ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. 


రాజస్థాన్‌ సిహోరీ ప్రాంతానికి చెందిన గులాబ్‌ అలియాస్‌ గులాబ్‌ మాలి (32) అనే వ్యక్తి మహారాష్ట్రలోని వెస్ట్‌పాల్‌ ఘాట్‌లో ఉంటున్నాడు. ఇతడు ముంబయిలోని జవేరిబజార్‌లో రంజూ జువెలర్స్‌ యజమాని అయిన శ్రవణ్‌ కుమార్‌ గెహ్లోత్‌ వద్ద 10 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ముంబయిలో వీరు తయారు చేసే నగలను హైదరాబాద్‌లోని నగల షాపులకు చేరవేయడం ఇతని పని. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారీ తెచ్చిన బంగారంలో కొంత కొట్టేసేవాడు. ఇలా బంగారం ట్రేడింగ్‌లో ఆన్‌లైన్ ద్వారా పెట్టుబడులు పెట్టాడు. అందులో బాగా నష్టాలు రావడంతో ఈ పెద్ద చోరీ పథకానికి కుట్ర రచించాడు. అందుకోసం తనకు తెలిసిన వ్యక్తి అయిన రాజస్థాన్‌ పాలీజిల్లాకు చెందిన ప్రవీణ్‌ కుమార్‌(31) సాయం కోరాడు. దానికి ప్రవీణ్‌ సరేనన్నాడు. 


ఎప్పటిలాగే గులాబ్‌ మాలి, ముఖేష్‌ పార్థికర్‌ అనే వ్యక్తితో కలిసి యజమానికి చెందిన 3.5 కిలోల బంగారు నగలను తీసుకొని హైదరాబాద్‌కు జబ్బర్ ట్రావెల్‌ బస్సులో బయలుదేరారు. ఇందులో 2.122 కిలోల నగలు గులాబ్‌ వద్ద, మిగతా నగలు ముఖేష్‌ వద్ద ఉన్నాయి.


పుణె చేరుకోగానే గోల్ మాల్
ముందస్తుగా అనుకున్న పథకం ప్రకారం ప్రవీణ్‌ కుమార్‌ గులాబ్‌ ప్రయాణిస్తున్న బస్సులో పుణె వరకు టికెట్‌ రిజర్వేషన్‌ లేకుండా ప్రయాణించాడు. ముఖేష్‌ నిద్రపోతున్న సమయంలో గులాబ్‌ తనవద్ద ఉన్న నగలను ప్రవీణ్‌‌కు అప్పగించాడు. నగలు తీసుకున్న ప్రవీణ్‌ పుణెలో బస్సుదిగి, రాజస్థాన్‌ పోయాడు. నగరానికి చేరుకున్న అనంతరం అమీర్‌పేట వద్దకు రాగానే తనవద్ద ఉన్న బంగారు నగలు ఎవరో చోరీ చేశారంటూ నిందితుడు హంగామా చేసి పోలీసులను ఆశ్రయించాడు. దాంతో యజమాని నగరానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానం వచ్చి ప్రశ్నించగా... నగలు ప్రవీణ్‌కు ఇచ్చానని ఒప్పుకొన్నాడు. దాంతో పంజాగుట్ట క్రైం పోలీసులు రాజస్థాన్‌ వెళ్లి ప్రవీణ్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. 


నమ్మకంగా ఉంటున్న పనివారు మోసాలకు పాల్పడుతున్నారని.. పెద్ద ఎత్తున లావాదేవీలు నిర్వహించే బంగారు నగల వ్యాపారులకు ఈ ఘటన తెలిసి రావాలని సీపీ అన్నారు. తమ వద్ద పనిచేస్తున్న వారిపై నిఘా పెట్టాలని.. తగిన జాగ్రత్తలు పాటించాలని బంగారు నగల వ్యాపారులకు సూచించారు. నగల చోరీ కేసును ఛేదించిన పోలీసులను సీపీ అభినందించారు.