నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో దక్షిణ ఏపీ- ఉత్తర తమిళనాడు కోస్తా తీరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో ఈ నెల 6న ఉత్తర, మధ్య బంగాళాఖాతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనం ప్రభావతం ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
శని, ఆదివారాల్లో
శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తాంధ్రలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శని, ఆది వారాల్లో రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
Also Read: KBC KTR Twitter: KBCలో కేటీఆర్ ట్వీట్.. ఇంతకీ సవాల్‌కు దాదా, సెహ్వాగ్ ఆన్సర్ చేశారా?
తెలంగాణలో వర్షాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్ 6న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అల్పపీడనం వాయుగుండంగా మారే సూచనలున్నాయని ప్రకటించింది. శనివారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు.
ఎల్లో హెచ్చరిక
శనివారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి బలహీనపడడంతో మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రాష్ట్రంలోని 18 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీచేసింది. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఖమ్మం, వరంగల్, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read: KCR meet Modi : పది సమస్యలు తీర్చండి... ప్రధానికి కేసీఆర్ విజ్ఞప్తులు..!