తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు.  ఢిల్లీలో టీఆర్ఎస్  భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన కేసీఆర్ ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ కోసం అక్కడే ఉన్నారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు సమయం ఖరారు కావడంతో వెళ్లి కలిశారు. దాదాపుగా అరగంట సేపు జరిగిన భేటీలో తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.




తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత  ఇండియన్ పోలీస్ సర్వీస్ ( ఐపీఎస్  ) అధికారుల అవసరం బాగా పెరిగిందని దానికి తగ్గట్లుగా అధికారుల కేటాయింపులు ఉండాలని కోరారు.  ప్రస్తుతం అన్ని రకాల ఐపీఎస్ అధికారులు తెలంగాణకు 139మందిని కేటాయించారని ఆ సంఖ్యను 195కి పెంచాలని కోరారు. ఎక్కడెక్కడ సీనియర్ ఐపీఎస్‌ల అవసరం ఉందో ప్రత్యేకంగా జాబితాను కూడా కేసీఆర్ ప్రధానమంత్రికి సమర్పించారు.



అలాగే తెలంగాణకు జవహర్ నవోదయ విద్యాలయాలను మంజరు చేయాలని కోరారు. తొమ్మిది చోట్ల జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయని మరో 21 జిల్లాలో అవసరం ఉందని.. దానికి తగ్గట్లుగా మంజూరు చేయాలని.. ఎక్కడెక్కడ అవసరం ఉందో వివరిస్తూ  జాబితాను సమర్పించారు.



ఇక పారిశ్రామిక పరంగా తెలంగాణ ఉన్నతమైన పద్దతులు పాటిస్తోందని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉంటోందని ప్రధానికి కేసీఆర్ తెలిపారు. టెక్స్ టైల్స్ రంగం కోసం ప్రత్యేకంగా రూ. వెయ్యి కోట్ల సాయాన్ని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.


ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ట్రైబల్ యూనివర్శిటీ పెట్టాల్సి ఉందని దీని కోసం రెండు వందల ఎకరాలను ఇప్పటికే గుర్తించామని తెలిపారు. స్థలాన్ని కేంద్రం కూడా పరిశీలించిందని తెలిపారు. వీలైనంత త్వరగా అక్కడ ట్రైబల్ యూనివర్శిటీ పెట్టాలని కోరారు.


ఇక తెలంగాణలో ఎప్పటి నుండో పెండింగ్‌లో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్.. ఐఐఎంను ఏర్పాటు చేయాలని మరో ప్రత్యేకమైన విజ్ఞప్తిని కేసీఆర్ చేశారు.


పీపీటీ మోడల్‌లో పెడుతున్న ఐఐటీలను ఇతర తెలంగాణ జిల్లాల్లో కూడా పెట్టాలని.. అలాగే కరీంనగర్ లో ఓ ఆర్‌ఈసీని ఏర్పాటు చేయాలని మరో ప్రత్యేకమైన విజ్ఞప్తి చేశారు. ఇక రోడ్లు ఇతర అంశాలపైనా కేసీఆర్ వినతి పత్రాలు సమర్పించారు. మొత్తం పదిఅంశాలపై తెలంగాణకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని కోరారు.


ఇరువురు నేతల మధ్య రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయో లేదో స్పష్టత లేదు. చాలా రోజులతర్వాత కలిసి నందున దేశ రాజకీయ పరిస్థితులపైనా చర్చించుకుని ఉంటారని భావిస్తున్నారు.