హైదరాబాద్ పోలీసుల తీరు మరోసారి వివాదాస్పదం అయింది. కొంత మంది అతిగా ప్రవర్తించడం వల్ల అది యావత్ పోలీసు శాఖకే మచ్చ తెచ్చే వ్యవహారంగా మారుతోంది. దీంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే అంశంపై విమర్శలు తలెత్తుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో నలుగురు కానిస్టేబుళ్లు చేసిన పని తీవ్రంగా వివాదాస్పదం అవుతోంది. ఈ నలుగురు కలిసి ఓ వ్యక్తిని చితకబాదారు. కింద పడేసి కాళ్లతో తన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.


 సికింద్రాబాద్ మెట్టుగూడ పరిధిలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. జిమ్ ట్రైనర్ అయిన ఆరోఖ్య రాజ్ అనే వ్యక్తిని పోలీసులు తీవ్రంగా కొట్టారు. పెద్ద కర్రలతో ఇష్టమొచ్చినట్లుగా బాదారు. కింద పడేసి కొట్టారు. దీంతో ఆ దెబ్బలకు జిమ్ ట్రైనర్ కాలు విరిగింది. దీంతో అతణ్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 3న ఓ బైక్ విషయంలో మరో వ్యక్తితో ఆరోఖ్యరాజ్ కు గొడవ జరిగింది. ఆ వ్యక్తి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేవాడు. దీంతో నలుగురు కానిస్టేబుళ్లు రాత్రి 11 గంటల సమయంలో ఆరోఖ్య రాజ్ దగ్గరికి వచ్చి పోలీస్ స్టేషన్ కు రావాలని కోరారు. కానీ, అప్పటికే రాత్రి అయిందని, పొద్దునే వస్తానని ఆరోఖ్య రాజ్ చెప్పాడు. 


Also Read: హైదరాబాద్‌లో మరో దారుణం, అందరూ చూస్తుండగానే యువకుడి దారుణ హత్య - అసలేం జరిగిందంటే !


అయినా వినని పోలీసులు స్టేషన్ కు రావాల్సిందేనని పట్టుబట్టారు. ఈ క్రమంలో గొడవ జరగడంతో కర్రలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. తనను కొట్టొద్దని అతని ఎంత వేడుకున్నా వినలేదు. అక్కడే ఉన్న అతని తల్లి కూడా పోలీసులను ఆపే ప్రయత్నం చేసినా వినలేదు. పోలీసులు కొట్టడంతో అతనికి ఒళ్లంతా గాయాలు అయ్యాయి. కాలు విరిగింది. 


గొడవ జరుగుతుందని తెలిసి బస్తీ వాసులు అక్కడికి చేరుకోవడంతో కానిస్టేబుళ్లు ఆరోఖ్యరాజ్ ను అక్కడ వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులే ఆరోఖ్య రాజ్ ను ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత పోలీసులే బేరసారాలకు వచ్చినట్లుగా బాధితుడు తెలిపాడు. జరిగింది మర్చిపోవాలని, వారు కోరినట్లుగా బాధితుడు తెలిపాడు. అయితే, పోలీసుల వాదన మరోలా ఉంది. ముందు జిమ్ ట్రైనర్ ఆరోఖ్య రాజ్ తమపై దాడి చేశాడని, అందుకే తాము చేయి చేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.


Also Read: KTR Asks Modi: భారత్ ఎప్పుడూ తలదించుకోలేదు, మీవల్ల దేశమంతా క్షమాపణ చెప్పాలా? మోదీకి కేటీఆర్ సూటి ప్రశ్నలు