హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. ఇటీవల నీరజ్ పన్వార్, ఆపై మరో పరువు హత్యతో భాగ్యనగరం మరోసారి ఉలిక్కిపడింది. తాజాగా బహదుర్‌పురాలో మరో హత్య కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు కత్తితో దాడి చేసి మరో యువకుడిని దారుణంగా హత్యచేశాడు. బహదుర్‌పురా కిషన్ బాగ్‌లో ఆదివారం రాత్రి అర్షద్ అజాజ్ అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.
పాత గొడవలతో కక్షగట్టి..
బహదుర్‌పురా కిషన్ బాగ్‌లో డైని ల్యాండ్ హోటల్ అర్షద్ అజాజ్ అనే యువకుడు నడుచుకుంటూ వెళ్లున్నాడు. జావిద్ అనే యువకుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా అజాజ్ పై దాడికి పాల్పడ్డాడు. కత్తిపోట్లకు గురైన అజాజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కత్తి పోట్లుకు గురైన అజాజ్ ను హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.
నిందితుడ్ని పట్టుకున్న స్థానికులు
అర్షద్ అజాజ్ పై కత్తితో దాడి చేసిన నిందితుడు జావిద్‌ను స్థానికులు అతికష్టమ్మీద పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు నిందితుడ్ని అప్పగించారు. పోలీసులు తమ వాహనంలో నిందితుడ్ని పీఎస్‌కు తరలించారు. మూడు రోజుల కిందట అర్షద్‌తో గొడవ జరగగా, దాంతో కక్షగట్టి అతడ్ని జావెద్ హత్య చేసి ఉంటానని పోలీసులు భావిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.