KTR on PM Modi: బీజేపీ నాయకులు తరచూ మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తుండడంపై మంత్రి కేటీఆర్ మోదీని సూటిగా నిలదీశారు. బీజేపీ నాయకులు చేస్తున్న ప్రసంగాలకు అంతర్జాతీయంగా దేశం తలదించుకోవాల్సివచ్చిందని, క్షమాపణలు చెప్పాల్సి వస్తోందని అన్నారు. మీ నాయకులు చేసిన విద్వేష ప్రసంగాలకు దేశం ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రధాని మోదీని ట్విటర్ లో ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. బీజేపీ లీడర్లు చేసిన ఇలాంటి వ్యాఖ్యల పట్ల ఖతర్ వంటి ఇస్లామిక్ దేశాలు భారత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయని అన్నారు.


‘‘నరేంద్ర మోదీ జీ.. బీజేపీ మతోన్మాదుల ద్వేషపూరిత ప్రసంగాలకు భారతదేశం అంతర్జాతీయ సమాజానికి ఎందుకు క్షమాపణలు చెప్పాలి? క్షమాపణ చెప్పాల్సింది బీజేపీ, అంతేకానీ, భారతదేశం కానేకాదు. రోజు విడిచి రోజు విద్వేషాన్ని చిమ్ముతున్నందుకు, ఇంకా వ్యాప్తి చేస్తున్నందుకు మీ పార్టీ ముందుగా దేశంలో ఉన్న భారతీయులకు క్షమాపణ చెప్పాలి’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.






‘‘మోదీ జీ.. మహాత్మా గాంధీ హత్యను బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ప్రశంసించినప్పుడు మీ మౌనం చెవిటితనంగా ఉంది. ఇంకా దిగ్భ్రాంతి కలిగించింది. నేను మీకు గుర్తు చేస్తున్నాను సార్, మీరు ఏమి అనుమతిస్తున్నారో అదే మీరు ప్రచారం చేస్తున్నారు. అధిష్ఠానం నుంచి వచ్చిన సైలెంట్ సపోర్ట్.. మతోన్మాదం, ద్వేషాన్ని బలపరుస్తోంది. అది కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది.’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.






‘‘భారత దేశ చరిత్రలో ప్రపంచంలోని ఏ దేశమూ కూడా ఇండియా నుంచి క్షమాపణలు కోరలేదు.. నరేంద్ర మోదీ గారూ. ఇప్పుడు కేవలం బీజేపీ వల్ల మాత్రమే ఆ పరిస్థితి వచ్చింది. బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యల వల్ల మనోభావాలు దెబ్బతిన్న ఇస్లామిక్ దేశం ఖతర్, యావత్ భారత్ నుంచి క్షమాపణలు కోరుతోంది. దేశాన్ని తలదించుకునేలా చేసిన ఈ రోజును దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.’’ అని టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ చేసిన ట్వీట్ ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.