Hyderabad: హైదరాబాద్ లో కార్లను అద్దెకు తీసుకుని అమ్మేస్తున్న మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ. 1.20 లక్షల విలువైన 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సనత్ నగర్ కు చెందిన మహమ్మద్ అస్లాం నవాజ్ కార్లను అద్దెకు తీసుకునే వ్యాపారం చేస్తుంటాడు. 2021 లో నిందితుడు మహమ్మద్ అస్లాం నవాజ్ కార్లను లీజు, అద్దెకు తీసుకోవడాన్ని ప్రారంభించాడు. మొత్తం ఇవ్వాలి అనేది కారు యజమానులతో అగ్రీమెంట్ కుదుర్చుకుంటాడు. అలా నవాజ్ 8 కార్ల యజమానులతో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నాడు. కార్లు అద్దెకు తీసుకుని కొన్ని నెలల పాటు సక్రమంగానే అద్దె చెల్లించే వాడు. సక్రమంగా కట్టడంతో యజమానులకు కూడా నవాజ్ పై నమ్మకం కుదిరేది. ఆ తర్వాతే తన అసలు రంగును చూపించేవాడు. ఇక ఎంతకీ అద్దె చెల్లించే వాడు కాదు. అలా ఆయా కార్లను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్ముకుని సొమ్ము చేసుకునేవాడు.


అద్దెకు తీసుకున్న కారు తనదే అని చెప్పి నమ్మించి రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు అమ్మేసేవాడు. లక్షల రూపాయలతో మంచి విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. లగ్జరీ లైఫ్ అనుభవించేవాడు. కారు అద్దెకు ఇచ్చిన యజమానులు అద్దె కోసం నవాజ్ ను అడిగితే సమాధానం ఇచ్చేవాడు కాదు. వారి నుంచి ఒత్తిడి ఎక్కువైతే ఇతర రాష్ట్రాలకు పారిపోయేవాడు. ఇలా గతంలో కూడా జైలుకు వెళ్లి వచ్చాడు మహమ్మద్ అస్లాం నవాజ్.


తన కారు తీసుకుని సక్రమంగా అద్దె చెల్లించకపోవడం, ఫోన్ కు కూడా స్పందించకపోవడంతో.. మేడ్చల్ జిల్లా చెర్లపల్లి న్యూ మింట్ కాలనీకి చెందిన నోముల సాయి రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు. టాస్క్ ఫోర్స్ సాయం తీసుకున్నారు. మంగళవారం (సెప్టెంర్ 5) రోజున పక్కా సమాచారం మేరకు చంద్రాయణ గుట్ట పోలీసులు నిందితుడిని చంద్రాయణ గుట్ట ఎక్స్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. మారుతి వితారా బ్రేజీ కారులో వెళ్తుండగా.. నవాజ్ ను పోలీసులు కాపు కాసి పట్టుకున్నారు. అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. నేరాన్ని ఒప్పుకున్నాడు అస్లాం. అమ్మిన కార్ల వివరాలను తెలిపాడు. అక్రమంగా అమ్మేసిన 8 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్ల విలువ కోటి 20 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.


పాఠశాలల్లో పార్టనర్ షిప్ పేరుతో మోసాలు


ఏలూరుకు చెందిన నందిగం రాణి, ధర్మరాజు దంపతులు. ప్రస్తుతం వీరిద్దరూ ఏలూరులోని శ్రీహర్షిత విద్యా సంస్థ యజమానులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే తమకు వచ్చే లాభాలు చాలకు మోసాల కోసం అదిరిపోయే ప్లాన్ వేశారు. ఇద్దరూ కలిసి తమ విద్యా సంస్థల్లో పార్టనర్ షిప్ పేరుతో అక్రమాలకు తెరతీశారు. ఇలా తమకు తెలిసిన వారి వద్ద, తమకు తెలిసిన వారి బంధువుల వద్ద ఈ మోసాలకు పాల్పడ్డారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 40 మంది వద్ద నుంచి కోట్లలో వసూలు చేశారు. కొందరి వద్ద లక్షలు కూడా దోచేశారు. ఆ తర్వాత వారు డబ్బులు అడిగినా ఇవ్వకపోవడంతో ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలోనూ రాణి, ధర్మరాజులపై కేసులు నమోదు అయ్యాయి.