Telangana BJP MLA Ticket Applications: 
అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి 115 సీట్లకు అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. తాజాగా బీజేపీ నేతల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహుల నుంచి సోమవారం నుంచి దరఖాస్తులు తీసుకుంటోంది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 10న ముగియనుంది. అయితే తొలిరోజు రికార్డు స్థాయిలో 182 దరఖాస్తులు వచ్చాయి. 


మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్, మల్లేష్ కౌంటర్ ఇంచార్జీలుగా బీజేపీ నేతల నుంచి అసెంబ్లీ టికెట్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న నేతలు ఎవరైనా మీడియాతో మాట్లాడినట్లు తెలిస్తే.. వారి అప్లికేషన్స్ పక్కన పెట్టాలని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరిశీలకులను ఆదేశించారు. ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఫోకస్ చేయాలని, పార్టీ గెలుపు కోసం మాత్రం ఆలోచించాలని నేతలకు కిషన్ రెడ్డి సూచించారు.  


ఒక్కొక్కరు 2 నుంచి 3 అప్లికేషన్లు..
బీజేపీ టికెట్ కోసం నేతల నుంచి తొలిరోజు విశేష స్పందన లభించింది. మొత్తం 182 దరఖాస్తులు రాగా, వీటిని కేవలం 63 మంది నేతలు సమర్పించారు. అంటే ఒక్కో నేత దాదాపు 3 స్థానాల నుంచి సీట్లు ఆశిస్తున్నారు. తమకు ఎక్కడి నుంచి సీటు వస్తుందో అర్థం కాక, అప్లికేషన్ ఫీజు కూడా లేకపోవడంతో ఆశావహులంతా 3 చోట్ల టికెట్ ఆశిస్తూ దరఖాస్తులు సమర్పించారు. తొలి ప్రాధాన్యత సీటు దక్కపోతే, వేరే చోట నుంచి బరిలోకి దిగాలని ఆశిస్తున్నారు. సెప్టెంబర్ 10న దరఖాస్తుల గడువు ముగియనుండగా.. అప్పటివరకూ వెయ్యికి పైగా అప్లికేషన్లు వస్తాయని పార్టీ అధిష్టానం అంచనా వేస్తోంది. 


రవి ప్రసాద్​గౌడ్‌ నుంచి తొలి దరఖాస్తు వచ్చింది. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానానికి ఆయన దరఖాస్తు చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి సామ రంగారెడ్డి, వేములవాడ నుంచి తుల ఉమ, భద్రాచలం నుంచి మాజీ ఎమ్మెల్యే కుంజర్ల సత్యవతి దరఖాస్తు చేశారు. అప్లికేషన్ ఫీజు లేకపోవడంతో సరూర్​నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఏకంగా మహేశ్వరం, ఎల్బీనగర్‌, ముషీరాబాద్​తో పాటు సనత్​నగర్ నియోజకవర్గాలు (4 సీట్లకు) దరఖాస్తు చేసుకున్నారు. 
తొలి జాబితా ఎప్పుడంటే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకుగానూ బీజేపీ తొలి అభ్యర్థుల జాబితాను సెప్టెంబరు 17 తరువాత ప్రకటించేలా కనిపిస్తోంది. ఎలాంటి విభేదాలు, రెండో ఆప్షన్ లేని 35 నుంచి 40 నియోజకవర్గాల అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సైతం ఒక్క జాబితా కూడా విడుదల చేయలేదు. హస్తం పార్టీ తొలి జాబితా తరువాత బీజేపీ రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసే ఛాన్స్ ఉంది. పరిస్థితులకు అనుగుణంగా మూడు, లేదా నాలుగు దఫాలుగా అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


టిక్కెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను జిల్లా, రాష్ట్ర, కేంద్ర పార్టీ స్థాయిలో మూడు దశలో నియోజకవర్గాలవారీగా పరిశీలించనున్నారు. నియోజకవర్గం నుంచి ముగ్గురు పేర్లను ఫైనల్ చేయగా.. చివరగా అధిష్టానం అభ్యర్థి పేరును ప్రకటించనుంది.