హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై వాహన రాకపోకలపై ఆంక్షలు విధించనున్నారు. ఇకపై ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే ఈ ఆంక్షలు పరిమితం కానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం పర్యటకుల తాకిడి అధికంగా ఉంటుంది కాబట్టి.. ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలను నిషేధిస్తే సందర్శకులకు మరింత సౌకర్యంగా ఉండనుంది. ఆదివారం రద్దీగా ఉండే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ వాహనాల రాకపోకలను నిషేధించడం ద్వారా రోడ్డుపై కూడా సులభంగా విహరించేందుకు ఆస్కారం ఉండనుంది.


అసలు ఈ ఆలోచన వచ్చేందుకు కారణం ఉంది. రెండు రోజుల క్రితం ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. అశోక్ చంద్రశేఖర్ అనే నెటిజన్ ట్వీట్ చేస్తూ.. ‘‘ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ను ఎందుకు ఆపివేయకూడదు? ప్రభుత్వం ఇలా చేయడం ద్వారా నగరవాసులకు ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. ప్రస్తుతం ట్యాంక్‌బండ్‌పై వాహనాల రద్దీ ఉన్నప్పుడు రోడ్డు దాటాలంటే చాలా కష్టంగా ఉంటోంది.’’ అని మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.


 






దీనిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ‘‘మంచి ఆలోచన. హైదరాబాద్ సీపీ గారూ.. మీరు మీ టీమ్ కలిసి ఈ విధానం అమలు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించగలరు’’ అని సీపీ అంజనీ కుమార్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. వారు ఈ విషయంపై ఆలోచించి తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం వేళలో సందర్శకులకు ఇబ్బంది కలగకుండా వాహనాల రాకపోకలను నిషేధించనున్నట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ వాహనాలను నిషేధిస్తున్నట్లు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. వచ్చే ఆదివారం నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని కమిషనర్ హైదరాబాదీలకు వెల్లడించారు.