కాదేది కవితకు అనర్హం అన్నాడో కవి. ఇప్పుడు కాదేది అవినీతికి అనర్హం అంటున్నారు కేటుగాళ్లు. మనుషులు జట్టుతో భారీ దందాకు తెరలేపారు. తెలుగు రాష్ట్రాల్లోని మనుషుల జుట్టు ఎగుమతిదారుల గట్టు రట్టు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్. వెంట్రుకలను అక్రమంగా చైనాకు తరిలిస్తున్నట్లు గుర్తించింది. చైనా బెట్టింగ్‌యాప్‌లపై ఈడీ విచారణ చేస్తుంది. ఈ దర్యాప్తులో కూపీలాగితే జుట్టు దందా వ్యవహారం బయటపడింది. 


తెలుగు రాష్ట్రాలకు రూ.16 కోట్లు


చైనాకు చెందిన వ్యాపారుల నుంచి సుమారు రూ.16 కోట్లు తెలుగు రాష్ట్రాల్లోని జుట్టు ఎగుమతిదారులకు అందినట్టు తేలింది. దీంతో ఈడీ ఆ వ్యాపారస్థులపై నిఘా పెట్టింది. అక్రమ లావాదేవీలపై ఫెమా ఉల్లంఘనల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.  హైదరాబాద్, ఏపీలోని తణుకులో వికాస్ హెయిర్ ఎంటర్‌ ప్రైజెస్, నరేశ్‌ విమెన్ హెయిర్ ఎంటర్ ప్రైజెస్, హ్రితిక్ ఎగ్జిమ్, ఎస్​.ఎస్​.ఇంపెక్స్, శివ్ కేశవ్ హ్యూమన్ హెయిర్, లక్ష్మి ఎంటర్ ప్రైజెస్, ఆర్.కె. హెయిర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలతో సహా మరో 8 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది.  


తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు 


మనుషుల వెంట్రుకలు ఎగుమతి చేస్తు్న్న వ్యాపార సంస్థల్లో భారీగా నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. సుమారు రూ.2.9 కోట్లు 12 మొబైల్ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్, డైరీలు, ఖాతాల పుస్తకాలు స్వాధీనం చేసుకుంది. ఈ దర్యాప్తుల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతి, యాదాద్రి, విజయవాడ తదితర పుణ్యక్షేత్రాలతోపాటు, స్థానిక క్షౌరశాల నుంచి వెంట్రుకలు సేకరించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని తెలింది. ముఖ్యంగా చైనా, మియన్మార్, బంగ్లాదేశ్, వియత్నాం, ఆస్ట్రియా దేశాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ ఎగుమతుల కోసం ఆయా దేశాలకు చెందిన పలువురు హైదరాబాద్‌లో ఉన్నట్లు ఈడీ విచారణలో వెలుగుచూసింది. 


Also Read: Afghanistan News: 'అమెరికా పౌరులారా.. కాబూల్ విమానాశ్రయం బయట ఉండొద్దు'


దిగుమతి సుంకం ఎగవేత


ఈ వ్యాపారాలలో అక్రమ లావాదేవీల కోసం ఉద్యోగుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. నాణ్యమైన జుట్టుపై పన్ను ఎక్కువగా ఉండడం వల్ల, నాసిరకం జుట్టు లేదా దూదిగా పేర్కొంటూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఈడీ తెలిపింది. దీంతో చైనా వ్యాపారులు దిగుమతి సుంకం 28 శాతం తప్పించుకోవడంతో పాటు 8శాతం దిగుమతి ప్రోత్సాహకాలు సైతం అక్రమంగా పొందుతున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు కోల్‌కతా, గువహటి నుంచి ఎక్కువగా ఎగుమతులు అవుతున్నాయని ఈడీ భావిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల ద్వారా మియన్మార్‌కు రోడ్డు మార్గంలో తరలించి అక్కడి నుంచి చైనాకు తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. 


హవాలపై ఆరా


చైనా బెట్టింగ్ యాప్‌ల స్కాంలో కీలకమైన లింక్యూన్ టెక్నాలజీస్, డాకీపే సంస్థల నుంచి హైదరాబాద్‌లోని వెంట్రుకల ఎగుమతి కంపెనీలకు రూ. 3.38 కోట్లు అందినట్లు అధికారులు గుర్తించారు. హవాలా మార్గంలో సొమ్మును పంపించినట్లు తేలిందని ఈడీ తెలిపింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో వెంట్రుకల వ్యాపారుల లావాదేవీలపై ఈడీతో పాటు కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


 


Also Read: Drugs Case: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు.. ఎవరెవరు లిస్టులో ఉన్నారంటే..