అఫ్గానిస్థాన్ లోని తమ పౌరులకు అమెరికా కీలక సూచనలు చేసింది. భద్రతా కారణాలు, ముప్పు ఉన్న దృష్ట్యా అమెరికా పౌరులు కాబూల్ ఎయిర్ పోర్టుకు రావొద్దని సూచించింది. విమానాశ్రయం గేట్ల వద్ద నిరీక్షించొద్దని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
మరో హెచ్చరిక..
అమెరికాకు తన బలగాల తరలింపునకు ఆగస్టు 31 వరకు గడువు విధిస్తూ తాలిబన్లు మరోసారి అల్టిమేటం జారీ చేశారు. అయితే గడువు దగ్గర పడుతుండగా అఫ్గాన్ లో పరిస్థితులు ఎలా మారబోతున్నాయనే దానిపై చర్చ జరుగుతోంది.
అఫ్గాన్ నుంచి విదేశీయులతో పాటు ఆ దేశ పౌరులు సైతం శరణార్థులుగా వెళ్లిపోతున్నారు. అమెరికా బలగాలు వీరికి సహకారం అందించి, అఫ్గాన్ నుంచి సురక్షితంగా విదేశాలకు తరలిస్తున్నాయి. అయితే తమ దేశంలో బలగాలను వెనక్కి రప్పించినప్పటికీ.. అమెరికా మాత్రం పౌరులకు సహాయం చేస్తూ విదేశాలకు తరలించడంపై తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నైపుణ్యం ఉన్న వారి అవసరం అఫ్గాన్‌కు ఉందని, అయితే అమెరికా వారిని ఇతర దేశాలకు తరలిస్తుందని ఆరోపించింది. తక్షణమే ఈ చర్యలను మానుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించింది.