తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపిన  డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అంతా అయిపోయిందేమోననుకున్న టైమ్ లో డ్రగ్స్ కేసులో రంగంలోకి దిగిన ఎన్ పోర్స్ మెంట్  డైరెక్టరేట్(ఈడీ) సినీ స్టార్స్ కు సమన్లు జారీ చేసింది. ఈనెల 31 నుంచి విచారణ ప్రారంభించనున్నట్లు  ఏబీపీ ప్రతినిధి ఓపీ తివారికి ఈడీకి చెందిన విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సెప్టెంబర్ 22లోగా సినీ స్టార్స్ ను విచారణ ముగించేలా ఈడీ సమన్లు జారీ చేసింది. చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రాణా దగ్గుబాటి, రవితేజ, పూరి జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, తరుణ్, నందు, శ్రీనివాస్ తదితరులు ఆ లిస్టులో ఉన్నట్టు సమాచారం. ఎక్సైజ్ శాఖ 2017లో నమోదు చేసిన కేసుల ఆధారంగా దర్యాప్తు జరగనుంది.


గతంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం పలువురు సినీ ప్రముఖులను విచారించినప్పటికీ సరైన సాక్ష్యాలు లేకపోవడంతో వీరిపై విచారణ  జరగలేదు. అప్పుడు సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు పలువురు డ్రగ్స్ విక్రేతలపై 12 ఛార్జ్ షీట్లను దాఖలు చేశారు. దాదాపు ఎనిమిది మందిపై మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై గతంలోనే కేసు నమోదు చేశారు. అయితే సినీ ప్రముఖులకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతో.. కేవలం కొందరిని విచారించారించి వదిలేశారు. తాజాగా మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. 


Also Read: Samantha: ఎవర్నీ బాధపెట్టాలని అనుకోలేదు.. వారికి నా క్షమాపణలు: సమంత


Samantha: సమంత కాలికి ఒకే చెప్పు.. సిండ్రెల్లాతో పోల్చుకున్న బ్యూటీ.. ఇంట్రెస్టింగ్‌ ఫొటో వైరల్


పూరి జగన్నాథ్ ఆగస్టు 31 విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు, ఛార్మి సెప్టెంబర్ 2, రకుల్ ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 6, రాణా దగ్గుబాటి సెప్టెంబర్ 8, రవితేజ, శ్రీనివాస్ సెప్టెంబర్ 9, నవదీప్, ఎఫ్ క్లబ్ జీఎం సెప్టెంబర్ 13, ముమైత్ ఖాన్ సెప్టెంబర్ 15, తనీష్ సెప్టెంబర్ 17, నందు సెప్టెంబర్ 20, తరుణ్ సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కావాలని ఏబీపీ ప్రతినిధికి విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసింది.


2017లో సిట్ జూలై నెలలో టాలీవుడ్ ప్రముఖులతో సహా పలువురు అనుమానితుల నుంచి జుట్టు, గోర్ల నమునాలను సేకరించారు. ఇప్పటికీ వీటి గురించి సిట్ నుంచి ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. మాదక ద్రవ్యాలను ముంబై నుంచి హైదరాబాద్‏కు రవాణా చేసి.. ఇక్కడ విక్రయిస్తున్న దక్షిణాఫ్రికాకు చెందిన రాఫెల్ అలెక్స్ విక్టర్ పై ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అతడిని 2017లో అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా.. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే.


డ్రగ్స్ కేసును సీబీఐ, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని గతంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.  చివరకు ఎక్సైజ్ శాఖ కేసుల ఆధారంగా డ్రగ్స్ కేసులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. తాజాగా పలువురు సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేసింది.


Also Read: Bigg Boss 5 Telugu: ‘బిగ్‌బాస్-5’ బిగ్ అప్‌డేట్: క్వారంటైన్‌లో కంటెస్టెంట్లు.. టెలికాస్ట్ తేదీ ఇదేనా?


Bangarraju Movie: షూటింగ్ మొదలెట్టిన ''బంగార్రాజు'', ఈ సారి కూడా సంక్రాంతి బరిలో దిగడం ఫిక్సా..!