మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా లేదా అనే సందేహాలకు తెరపడింది. ఒక వర్గం ఎన్నికలు కావాలని, మరో వర్గం ఎన్నికలు అక్కర్లేదు.. ఏకగ్రీవం చాలంటూ వాదోపవాదనలు చేసుకుంటున్న తరుణంలో.. 'మా' క్రమశిక్షణ సంఘం ఎన్నికల తేదీని ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 10న ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు మా అధ్యక్షుడు నరేష్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం ఎదురుచూస్తోన్న పలు ప్యానెల్ సభ్యుల్లో సంతోషం నెలకొంది. ఈ ఎన్నికల కోసం ప్రస్తుతం ప్రకాష్ రాజ్‌తోపాటు.. మంచు విష్ణు, సీవీఎఎల్ నరసింహరావు, హేమాలు పోటీకి సిద్ధమయ్యారు. వీరితోపాటు మరెవరైనా బరిలో దిగుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. 


'మా' ఎన్నికల కోసం ఇప్పటివరకు పెద్ద రాద్దాంతమే జరిగింది. మొన్నటివరకు నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా మాటల యుద్ధం సాగింది. ఆ వేడి ఇంకా చల్లారక ముందే.. నటి హేమ 'మా' అధ్యక్షుడు నరేష్ మీద విమర్శలు గుప్పిస్తూ పంపిన ఆడియో మెసేజ్‌పై పెద్ద రచ్చే జరిగింది. 'మా' నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆమె చేసిన ఆరోపణలపై నరేష్, జీవిత ఘాటుగానే స్పందించారు. హేమ తప్పుడు ఆరోపణలు చేస్తూ, అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆమెపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో హేమకు క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వివాదాలు 'మా' పరువును తీసేలా ఉండటంతో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగక తప్పలేదు. వెంటనే 'మా' ఎన్నికలు జరపాలంటూ చిరు.. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు. 


చిరు లేఖ.. అప్పట్లో నరేష్, మంచు విష్ణు మద్దతుదారులకు కాస్త ఇబ్బందిగానే మారింది. వర్గాలుగా విడిపోయిన మా సభ్యులు.. నరేష్‌నే అధ్యక్షుడిగా కొనసాగించాలని వాదిస్తుంటే.. మరికొందరు మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని అంటున్నారు. విష్ణు కూడా పెద్దలు అంగీకరిస్తేనే తాను అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటానని తెలిపారు. అయితే, ప్రస్తుతం ఎన్నికల్లో బరిలో దిగేందుకు సిద్ధమైన ప్రకాశ్ రాజ్, హేమ వర్గాలు కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిందే అని డిమాండ్ చేశారు. చిరంజీవి లేఖతో ఈ వర్గానికి మరింత ధైర్యం లభించింది. 


ప్రస్తుతం ఈ ఎన్నికలు 'మా'కు సొంత బిల్డింగ్ కట్టాలనే హామీ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే డిమాండ్ వినిపించింది. ఇటీవల విష్ణు మా భవనానికి స్థలం ఇదిగో అంటూ మరో వీడియోను కూడా పోస్ట్ చేశారు. దీంతో ఆయన మా అధ్యక్షుడిగా ఖరారే అనుకున్న క్షణంలో.. క్రమశిక్షణ సంఘం ఎన్నికల తేదీ ప్రకటించి పెద్ద బాంబే పేల్చింది. చిరు రాసిన లేఖ వల్లే క్రమశిక్షణ సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఎవరినైనా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే.. గొడవలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని సమాచారం.