Hyderabad News: హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. మహిళను రాత్రంతా స్టేషన్ లో ఉంచి లాఠీలతో కొట్టారని బాధితురాలు ఆరోపిస్తోంది. అలాగే తన శరీరంపై లాఠీతో కొట్టినట్లుగా ఉన్న గాయాలను కూడా చూపిస్తోంది. ఆగస్టు 15వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో తాను ఇంటికి వెళ్తుండగా.. పోలీసులు వచ్చి వాహనంలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని.. సెల్ ఫోన్ లాక్కొని చిత్ర హింసలకు గురి చేశారని ఆరోపించింది. బుధవారం ఉదయం తనను ఇంటికి పంపించినట్లు చెప్పింది. అయితే ఆమె చేస్తున్న ఆరోపణలు అన్నీ నిజం కాదని.. ఎల్బీ నగర్ ఇన్ స్పెక్టర్ తెలిపారు. మీర్‌ పేట నంది హిల్స్ లో బాధితురాలు నివాసం ఉంటుండగా... ఆమెతో పాటు ఆమె బంధువులు అందరూ పోలీస్టేషన్ లో ఆందోళనకు దిగారు. 


ఎల్బీ నగర్ జంక్షన్ వద్ద ముగ్గురు మహిళలు పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారని సమాచారం వచ్చిందని ఎల్బీ నగర్ డీసీపీ సాయి శ్రీ తెలిపారు. 16వ తేదీ తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చామని.. ఐపీసీ - 209 సెక్షన్ కింది కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. ఒక మహిళపై పోలీసులు దాడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారని.. బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించిన తర్వాత తప్పుగా తేలితే దోషులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.


ఇద్దరు పోలీసుల సస్పెండ్


ఈ కేసులో రాచకొండ సీపీ చౌహాన్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు పోలీసులపై వేటు వేశామని చెప్పారు. మహిళపై దాడికి పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేస్తూ సీపీ చౌహాన్ ఆదేశించారు. మహిళపై దాడి ఘటనపై విచారణ చేసి నివేదిక తెప్పించుకున్న సీపీ.. ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.