Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీ టప్పాచబుత్రలో బుధవారం రోజు అర్ధరాత్రి ఘాటైన భరించలేని వాసనలు విపరీతంగా వచ్చాయి. ఈ వాసనలతో స్థానికులంతా తీవ్రంగా భయపడిపోయారు. ముఖ్యంగా టప్పాచబుత్ర, యూసుఫ్ నగర్, కార్వాన్, నటరాజ్ నగర్, మహేష్ కాలనీల్లో విపరీతమైన వాసనలు వచ్చాయి. దీంతో స్థానికులంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపై జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోలేక.. వాసన ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. కొందరు ఈ వాసనల వల్ల వాంతులు కూడా చేసుకున్నారు. స్థానికుల ఫిర్యాదులో పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆ వాసనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసకునే ప్రయత్నం చేశారు. కానీ గుర్తించలేకపోయారు. సుమారు గంటన్నర త్రవాత వాసన రావడం ఆగిపోవడంతో స్థానికులతో పాటు పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఆసలు ఆ వాసన ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఆగిపోయిందనేది మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. 


గతంలో పారిశ్రామిక వాడలకు సమీపంలోని బాలా నగర్, జీడిమెట్ల ప్రాంతాలకు సమీపంలోని కొన్ని బస్తీల్లో కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే రసాయన వ్యర్థాలు కలవడం వల్ల ఈ తరహా ఘటనలు గతంలో వెలుగు చూసినట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ పాతబస్తీ సమీప ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగడం మాత్రమే ఇదే మొదటి సారి. అందుకే స్థానికులంతా తీవ్రంగా భయపడిపోయారు.