తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్‌టీయూ క్యాంప‌స్‌లోని గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్‌లో గురువారం (మే 25) ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఎంసెట్ అగ్రిక‌ల్చర్, మెడిక‌ల్, ఇంజినీరింగ్ కోర్సుల‌కు సంబంధించిన ఫ‌లితాల ర్యాంకుల‌ను, మార్కుల‌ను విడుద‌ల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, ఇతర వెబ్‌సైట్‌లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచారు.

ఎంసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

ఎంసెట్ ఫలితాల్లో మొత్తంగా 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో ఇంజినీరింగ్‌లో 80 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో బాలురు 79 శాతం, బాలికలు 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక అగ్రికల్చర్‌ &  ఫార్మసీ విభాగంలో 84 శాతం బాలురు, 87 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు.

ఎంసెట్‌ ఇంజినీరింగ్ పరీక్షకు 1,95,275 మంది హాజరుకాగా.. అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షకు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అగ్రికల్చర్ & ఫార్మా విభాగంలో 91,935 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 1,57,879 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం వివరాలు...

పరీక్షలకు దరఖాస్తు చేసిన తెలంగాణ విద్యార్థులు 1,53,890
పరీక్షలకు దరఖాస్తు చేసిన ఏపీ విద్యార్థులు 51,461
పరీక్షకు హాజరైన విద్యార్థులు 1,95,275
ఉత్తీర్ణత సాధించినవారు 1,57,879
ఉత్తీర్ణత శాతం 80%
బాలురు ఉత్తీర్ణత శాతం 79%
బాలికల ఉత్తీర్ణత శాతం 82%

అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీమ్ వివరాలు..

పరీక్షలకు దరఖాస్తు చేసిన తెలంగాణ విద్యార్థులు  94,589
పరీక్షలకు దరఖాస్తు చేసిన ఏపీ విద్యార్థులు  20,743
పరీక్షకు హాజరైన విద్యార్థులు  1,01,544
ఉత్తీర్ణత సాధించినవారు  91,935 
ఉత్తీర్ణత శాతం  86%
బాలుర ఉత్తీర్ణత శాతం  84%
బాలికల ఉత్తీర్ణత శాతం  87%

సత్తాచాటిన ఏపీ విద్యార్థులు..
తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ రెండు విభాగాల్లోనూ ఏపీకి చెందిన విద్యార్థులే టాప్‌-5 ర్యాంకుల్లో సత్తా చాటడం గమనార్హం. విశాఖపట్నానికి చెందిన అనిరుధ్‌ అనే విద్యార్థికి మొదటి ర్యాంకు కైవసం చేసుకోగా.. మరో ముగ్గురు విద్యార్థులు టాప్-5లో నిలిచారు. ఇక అగ్రికల్చర్‌ & మెడిసిన్‌ కేటగిరీలోనూ టాప్‌-5 ర్యాంకుల్లో నలుగురు ఏపీకి చెందిన వాళ్లే ఉండటం గమనార్హం. ఈ విభాగంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బూరుగుపల్లి సత్య రాజ జశ్వంత్‌ ఇందులో టాపర్‌గా నిలిచాడు.

తెలంగాణ ఎంసెట్ టాపర్లు వీరే..

ఇంజినీరింగ్ విభాగం లో టాపర్స్:

1. సనపల్ల అనిరుద్ ఫస్ట్ ర్యాంక్

2. యాకంటి మనిందర్ రెడ్డి

3.చల్ల ఉమేష్ వరుణ్

4.అభినిత్ మంజెటి

5.పన్నతోట ప్రమోద్ కుమార్ రెడ్డి

అగ్రికల్చరల్ అండ్ మెడికల్ టాపర్స్

1.బూరుగుపల్లి సత్య ఫస్ట్ ర్యాంక్

2.నాసిక వెంకట తేజ

3.పసుపులేటి లక్ష్మి

4.దుర్గంపూడి కార్తికేయ రెడ్డి

5.బుర్ర వరుణ్ తేజ

జూన్‌లో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ఉండే అవకాశం ఉంది. ఇక, స్థానిక విద్యార్థుల కోసం రాష్ట్ర కోటా కింద 85శాతం రిజర్వ్‌ చేయగా, 15 శాతం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు.

ఎంసెట్ ఫలితాల వెల్లడి ఈ కార్యక్రమంలో ఎంసెట్ కన్వీనర్ డా.బి డీన్ కుమార్, ప్రభుత్వ ఉన్నత విద్యా కార్యదర్శి వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూ-హైదరాబాద్‌ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్ష; మే 12 నుంచి 14 వరకు ఆరు విడతల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్ పరీక్షకు 1,95,275 మంది హాజరుకాగా.. అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షకు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 21 జోన్లలో ఎంసెట్ పరీక్ష నిర్వహించారు. వీటిలో తెలంగాణలో 16 జోన్లు, ఏపీలో 5 జోన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 137 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. వీటిలో తెలంగాణలో 104 కేంద్రాలు, ఏపీలో 33 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.

Related Articles:

➥ తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణత నమోదు!

➥ తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి!

తెలంగాణ ఎంసెట్ అగ్రిక‌ల్చర్, మెడిసిన్ టాప్-10 ర్యాంక‌ర్లు వీరే!