Hyderabad News:

  హైదరాబాద్ లో అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే ఇంట్లోకి ఒక యువకుడు చొరబడడం చర్చనీయాంశమైంది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్కంపేట రోడ్డులో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. 


మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు అయిన కాట్రగడ్డ ప్రసూన ఇంట్లోకి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఒకతను అర్ధరాత్రి చొరబడ్డాడు. శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి  ప్రహరీ దూకి మాజీ ఎమ్మెల్యే ఉంటున్న పై పోర్షన్ గది తలుపులు తెరిచేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన కింది ఫ్లోర్ లో ఉంటున్న డ్రైవర్ అప్రమత్తమై ఫోన్ చేసి ఆమెకు సమాచారమిచ్చారు. ప్రసూన, ఆమె కుటుంబసభ్యులు లైట్లు వేసేసరికి అతను గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ప్రసూన, ఆమె కుమార్తె కరణం అంబికా కృష్ణ చౌదరి తమ అనుచరులతో కలిసి అతడి కోసం గాలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడు ఒక బార్ లో ఉన్నట్లు గుర్తించి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.


పోలీసుల విచారణలో ఆ వ్యక్తి ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన చంద్రశేఖర్ అని తేలింది. మద్యం మత్తులో ఇంట్లోకి ప్రవేశించినట్లు అతను చెప్పాడని పోలీసులు తెలిపారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నట్లు, బల్కంపేట లోని ఓ హాస్టల్ లో ఉంటున్నట్లు చెప్పాడని అన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతామని తెలిపారు. 


నన్నుచంపేందుకు ప్రయత్నిస్తున్నారు


ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే ప్రసూన కుమార్తె అంబిక కృష్ణ మాట్లాడారు. తనకు కరణం వెంకటేష్ అనే వ్యక్తితో విభేదాలున్నట్లు తెలిపారు. అతనే తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. వెంకటేష్ అనుచరుడు త్రివేది అనే వ్యక్తిపై తాము ఇదివరకే చీరాల డీఎస్పీకి ఫిర్యాదు చేశామని చెప్పింది.