Hyderabad Metro Rail News: హైదరాబాద్ మెట్రో స్టేషన్ల వద్ద కొన్ని చోట్ల ఉన్న ఉచిత వాహనాల పార్కింగ్ ను ఉన్నట్టుండి పెయిడ్ చేయడం వివాదానికి దారి తీసింది. గురువారం (ఆగస్టు 14) నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న పార్కింగ్ స్థలంలో నిర్వాహకులు పెయిడ్ పార్కింగ్ అని చెప్పడంతో అది పెద్ద వివాదానికి దారి తీసింది. చాలా సేపు వాహనదారులకు నిర్వాహకులకు మధ్య ఘర్షణ చెలరేగింది. చాలా ఏళ్లుగా మెట్రో ప్రయాణికులు తమ వాహనాలను ఆ స్థలంలో ఫ్రీగా పార్కింగ్ చేసుకుంటున్నారు. కానీ, గురువారం నుంచి నిర్వాహకులు పెయిడ్ అని చెప్పడంతో వాహనదారుల నుంచి విపరీతమైన వ్యతిరేకత ఎదురైంది.
పని చేయని యాప్
పైగా ఒక ప్రత్యేకమైన యాప్ డౌన్ లోడ్ చేసుకొని, దాని ద్వారా చెల్లింపులు చేయాలని సూచించారు. ఒకేసారి టూ వీలర్ కు రూ.40 వరకూ వసూలు చేస్తున్నారు. అది కూడా ‘పార్క్ హైదరాబాద్’ అనే యాప్ నుంచి చేయాలని కండీషన్ పెట్టారు. ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ కావడం లేదని వాహనదారులు చెబుతున్నారు. అసలే ఆఫీసులకు వెళ్లే తొందరలో ఉన్న వారిని ఈ పార్కింగ్ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.
నగదు చెల్లించి పార్కింగ్ చేసేందుకు కూడా నిర్వాహకులు అనుమతించకపోవడంతో చాలా మంది వాహనదారులు వారిపై తిరగబడాల్సి వచ్చింది. నిర్వాహకులు మాత్రం సదరు యాప్ డౌన్ లోడ్ చేసుకొని, అక్కడ ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి మాత్రమే పార్కింగ్ చేయాలని చెబుతున్నారు. నిన్నటి వరకూ ఇక్కడ ఎలాంటి పార్కింగ్ ఫీజును వసూలు చేయకుండా.. ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా చేయడం పట్ల వాహనదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.