Delhi Liquor Case And Court Extends Custody Of Kejriwal, Kavitha : ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్ట్‌ అయి జైలులో ఉన్న ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌, భీఆర్‌ఎస్‌ నేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె కవిత జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరి కస్టడీని సెప్టెంబర్‌ రెండో తేదీ వరకు కోర్టు పొడిగిస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. మద్యం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలను ఎదుర్కొంటూ వీరిద్దరు అరెస్ట్‌ అయ్యారు. వీరిద్దరూ గడిచిన కొన్నాళ్ల నుంచి జైలులోనే ఉన్నారు. ప్రస్తుతం తీహాడ్‌ జైలులో ఉన్న ఈ ఇద్దరి నేతలు కస్టడీ గడువు ముగియడంతో ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఎదుట వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఇరుపక్షాలకు చెందిన లాయర్లు వాదనలు వినిపించారు. ఇరువాదనలు విన్న కోర్టు జడ్జి మరోసారి కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 


కవిత తరపున కీలక వాదనలు వినిపించిన మోహిత్‌రావ్‌


ఎమ్మెల్సీ కవిత తరపున రౌస్‌ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక జడ్జి ఎదుట న్యాయవాది మోహిత్‌ రావ్‌ కీలక వాదనలు వినిపించారు. సాక్షులను ఒత్తిడి చేసి తప్పుడు వాంగ్మూలాలను నమోదు చేశారంటూ కవిత తరఫు న్యాయవాది మోహిత్‌ రావ్‌ పేర్కొన్నారు. సాక్ష్యులు, అప్రూవర్ల వాంగ్మూలం నమోదు చేసిన సమయంలో చిత్రీకరించిన వీడియోలు, ఆడియోలను తమకు ఇవ్వాలంటూ ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్‌ రావ్‌ కోర్టును అభ్యర్థించారు. ఒత్తిడి చేసి నమోదు చేసిన వాంగ్మూలాలు చెల్లుబాటు కావని స్పష్టం చేశారు. శరత్‌ చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితపై ఈడీ ఆరోపణలు చేయడం సరికాదంటూ వాదించారు. శరత్‌ చంద్రారెడ్డితో ఏవో లావాదేవీలు జరిగినట్టు ఈడీ పేర్కొంటోందని, కానీ, అనేక ఏళ్ల నుంచి వారి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలని న్యాయవాది మోహిత్‌రావ్‌ కోర్టును కోరారు. ఇందుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల ఆధారాలు ఉన్నట్టు తెలిపారు. ఈ కేసులో కోర్టు కీలక అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మరోసారి కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలను జారీ చేసింది.