Neera Cafe: హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్.. నీరా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం స్వామీజీలతో కలసి వేదికపై నీరా పానియాన్ని సేవించారు. నీరాలో సున్నా శాతం ఆల్కహాల్ ఉంటుందని.. ఇది హానికరమైన పానియం కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నీరా పానియంపై ఎవరూ తప్పుడు ప్రచారం చేయొద్దని.. వీలైనంత వరకు దీన్ని ప్రతిరోజూ తాగాలని సూచించారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఇతర డ్రింక్స్ కంటే దీన్ని తాగడం మేలని చెప్పారు.


రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్నట్లుగానే కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ ను అమలు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ట్విట్టర్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కల్లుగీస్తూ ప్రమాదవశాత్తూ ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని వివరించారు. 






గీత కార్మికుల బీమా పథకం


రైతుబీమా తరహాలోనే రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో కల్లుగీత కార్మికులకు ‘గీత కార్మికుల బీమా’ పథకాన్ని అమలు చేయాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కల్లు గీచే సమయంలో ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. కల్లు గీస్తూ ప్రమాదంలో ఎవరైనా గీత కార్మికులు చనిపోతే వారి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా అందజేస్తామన్నారు. ఈ నగదు మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతు బీమా తరహాలోనే గీత కార్మికుల బీమా పథకం తీసుకురావడంపై మంత్రులు, అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఎప్పటినుంచో కల్లుగీస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఊహించని ప్రమాదం జరిగి కల్లుగీత కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం గీత కార్మికుల బీమా పథకం చేపట్టాలని భావిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ అన్నారు. గీత కార్మికుల కోసం తీసుకొస్తున్న బీమా పథకానికి సంబంధించిన విధివిధానాలు రూపాందించాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, సీఎస్‌ శాంతికుమారిలను సీఎం కేసీఆర్ ఆదేశించారు.