Zero Shadow Day: హైదరాబాద్ లో ఈనెల 9వ తేదీన అద్భుతం ఆవిష్కృతం కానుంది. మధ్యాహ్నం 12.12 గంటలకు రెండు నిమిషాల పాటు నీడ కనిపించదని.. అది జీరో షాడో డే అని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ టెక్నికల్ అధికారి ఎన్. హరిబాబు శర్మ తెలిపారు. ఆ సమయంలో భాగ్యనగరంలో సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడతాయని చెప్పారు. అప్పుడు ఎండలో 90 డిగ్రీల కోణంలో ఉంచిన ఏ వస్తువు నీడ కూడా రెండు నిమిషాల పాటు కనిపిందన్నారు. 12.12 నుంచి 12.14 వరకు మీరు ఈ విషయాన్ని గమనించవచ్చని సూచించారు. ఈనెల 9వ తేదీనే కాకుండా ఆగస్టు 3వ తేదీన కూడా జీరో షాడో డే ఏర్పడుతుందని వివరించారు. సమయంలో మార్పులతో దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ ఇలా నీడ మాయం అవుతుందని హరిబాబు శర్మ చెప్పుకొచ్చారు. అయితే ఏప్రిల్ 25 (మంగళవారం) న సరిగ్గా మధ్యాహ్నం 12.17 నిముషాలకు ఈ నీడలు కనిపించకుండా పోతాయని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. బెంగళూరులోని కోరమంగళలో ఉన్న Indian Institute of Astrophysics (IIA) అధికారులు క్యాంపస్‌లో పలు ఈవెంట్‌లు చేయనున్నారు. ఇప్పటికే దీనిపై బెంగళూరు సిటిజన్లు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


జీరో షాడో డే అంటే ఏంటి..? 


Astronomical Society of India (ASI) చెబుతున్న వివరాల ప్రకారం...జీరో షాడో టైమ్‌లో ఏ వస్తువుపైన కానీ, మనిషిపైన కానీ సూర్యుడి కాంతి పడినా నీడ కనిపించదు. దీన్నే టెక్నికల్ పరిభాషలో జెనిత్ పొజిషన్ ( Zenith Position) అంటారు. ఈ కారణంగానే జీరో షాడో డే వస్తుంది. ఏటా రెండుసార్లు ఈ ఫినామినన్‌ జరుగుతుందని వెల్లడించింది. కర్కాటక, మకరరేఖల మధ్యనున్న ప్రాంతాల్లోనే ఇది కనిపిస్తుంది. జీరో షాడో టైమ్‌లో సూర్యుడి అక్షాంశం, మనిషి అక్షాంశం సమాంతరంగా ఉంటాయి. అంటే సూర్యూడి కాంతి మనిషి పరిధిని దాటి పోలేదు. అందుకే కింద నీడ పడదు. 


ఎందుకిలా జరుగుతుంది..? 


సూర్యూడి చుట్టూ భూమి తిరిగే క్రమంలో రొటేషన్ యాక్సిస్‌ 23.5 డిగ్రీల మేర వంగిపోతుంది. ఈ క్రమంలోనే మన వాతావరణంలో మార్పు వస్తూ ఉంటుంది. అంటే...కాంతి తీవ్రతలో మార్పు వస్తుంది. సూర్యుడు నట్ట నడి మధ్యకు వచ్చేశాడు..అందుకే ఇంతగా ఎండ మండుతోంది అనుకుంటాం. కానీ...సూర్యుడు కచ్చితంగా నడి నెత్తి మీదకు కేవలం రెండేసార్లు వస్తాడు. ఉత్తరాయణంలో ఓసారి, దక్షిణాయనంలో మరోసారి ఇవి జరుగుతాయి. అప్పుడు మాత్రమే కరెక్ట్‌గా మధ్యలోకి వచ్చేస్తాడు సూర్యుడు. దీన్నే జెనిత్ పాయింట్‌ అని పిలుస్తారు. ఇక టెక్నికల్‌గా చెప్పాలంటే సూర్యుడు మకరరాశి, కర్కాటక రాశి మధ్య +23.5,-23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్నప్పుడు ఈ వింత జరుగుతుంది. కరెక్ట్‌గా మధ్యలోకి వచ్చేయడం వల్ల సూర్య కిరణాలు స్ట్రెయిట్‌గా భూమిని తాకుతాయి. అందుకే మన నీడ కనిపించదు. భువనేశ్వర్, ముంబయి, హైదరాబాద్, బెంగళూరులో ఈ జీరో షాడో డే తరచూ కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా రెప్ప పాటులోనే జరిగినప్పటికీ..దాని ప్రభావం మాత్రం దాదాపు నిముషం పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2021లో ఒడిశా, భువనేశ్వర్‌లో ఇలానే జరిగింది.