Bike Stunt: ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదకర స్థితిలో బస్సు వెనక నుంచి కాలుతో నెడుతున్నట్లుగా ఓ యువకుడు తీసుకున్న వీడియో ఘటనపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెర్రి వేయి విధానాలు అంటే ఇదే అంటూ తన పర్సనల్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండని వీడియో ట్యాగ్ చేసి మరీ చెప్పారు. అలాగే ప్రమాదాల బారిన పడి మీ తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చకండని చెప్పుకొచ్చారు.






టీఎస్ఆర్టీసీ ఎండీ అనే అఫీషియల్ ట్విట్టర్ ఖాతా నుంచి ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మిధానీ డిపోనకు చెందిన బస్సు 104-ఎ రూట్లో ఆర్టీసీ బస్సు వెళ్తుండగా.. ఓ యువకుడు ద్విచక్ర వాహనం నడుపుతూ ఓ కాలుతో బస్సు వెనక భాగాన్ని నెడుతున్నట్లు ఉన్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.






సామాజిక అంశాలపై ఎప్పుడూ స్పందించే సజ్జనార్..


బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ కు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ట్వీట్ చేశారు. అందులో మోసపూరిత కంపెనీలకు ప్రచారం చేయొద్దంటూ కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజంలోని సామాజిక వ్యవస్థను నాశనం చేసే ఆమ్ వే వంటి కంపెనీలకు అంబాసిడర్లుగా ఉండొద్దని అభ్యర్థించారు. సెలబ్రిటీలు ఎరూ ఇలా చేయొద్దని అన్నారు. అమితాబ్ లాంటి స్టార్ హీరోలు ఇలాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్వవహరించడం సరికాదని సజ్జనార్ సూచించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. గతంలో క్యూనెట్ లాంటి గొలుసు కట్టు వ్యాపారం చేసే సంస్థలకు సంబంధించిన యాడ్స్ లలో నటించవద్దని, అలాంటి అలాంటి కంపెనీలను ప్రమోట్ చేయొద్దని సజ్జనార్ కోరారు. మరోవైపు అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మల్టీ లెవెన్ మార్కెటింగ్ ప్రమోటింగ్ కంపెనీ ఆమ్ వేపై 2022లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. గొలుసు కట్టు వ్యాపారం పేరుతో మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించిన ఈడీ... ఆమే వే ఆస్తులను జప్తి చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది.