CM KCR News: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. మామూలు వరి ధాన్యానికి చెల్లించినట్లుగానే తడిసిన ధాన్యానికి కూడా ధర చెల్లిస్తామని వివరించారు. వ్యవసాయాన్ని కాపాడుతూ... కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు, అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన వరి ధాన్యం సేకరణ, భవిష్యత్తులో యాసంగి వరి ముందస్తుగా కోతలకు వచ్చేలా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో యాసంగి వరి కోతలు మార్చి నెలలోపే పూర్తయ్యేలా ఎలాంటి విధానాలు అవలంభిచాలో అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ దిశగా రాష్ట్ర రైతాంగాన్ని కూడా చైతన్యం చేయాలని చెప్పారు.
ఎంత వరి పండించినా చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తున్నాం..!
వ్యవసాయ అభివృద్ధికి, రైతు కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణ ఊహించని రీతిలో సత్ఫలితాలను ఇస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నో రాష్ట్రాలను అధిగమనిస్తూ... తెలంగాణ రైతులు వరి ధాన్యాన్ని పండిస్తున్నారని చెప్పారు. రైతులు ఎంత పంట పండించినా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలు కోర్చి అయినా గింజ లేకుండా కల్లాల వద్దకే వెళ్లి సేకరిస్తుందని పేర్కొన్నారు. రైతుల కోసం ఇంత చిత్త శుద్ధితో పని చేస్తున్న ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని అన్నారు. ప్రకృతి వైపరీత్యాన్ని ఆపలేమని చెప్పారు. అయినా మనకేం సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించలేదని వివరించారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల రూపాయలు అందిస్తూ ఆదుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అలాగే ఆర్థికంగా రాష్ట్ర ఖజానాలు ఎంత భారమైనా వెనుకంజ వేయకుండా రైతన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని వివరించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు యాసంగి వరి ధాన్యం తడుస్తున్న నేపథ్యంలో రైతన్నల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుందని అన్నారు.
పంట కోతలను నాలుగైదు రోజులు ఆపితే బాగుంటుంది..!
అయితే పంట కోతలను ఓ నాలుగైదు రోజులు ఆపితే బాగుంటుందని సీఎం కేసీఆర్ అన్నదాతలకు సూచించారు. కొన్ని చోట్ల అకాల వర్షాలు కొనసాగుతుండడం వల్ల ధాన్యం సేకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అయినా త్వరలోనే సేకరణ పూర్తి చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అని కుమార్ చెప్పారు. మరో మూడు నాలుగు రోజుల పాటు వానలు కొనసాగనున్నాయని అధికారులు వివరించారు. దీంతో అప్పటి దాకా వరి పంటను కోయకుండా ఆపటం మంచిదని, దీని వల్ల ధాన్యం తడవకుండా జాగ్రత్త పడొచ్చని సూచించారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలను గుణపాఠంగా తీసుకొని భవిష్యత్తులో నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. మార్చి నెల తర్వాత వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఆలోపే కోతలు పూర్తి చేసుకోవడం మంచిదని పేర్కొన్నారు.