YS Viveka Case : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంతో ముడిపడిపోయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మళ్లీ సైలెంట్ అయిపోయింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు వేసవి సెలవుల తర్వాతే ఇస్తామని హైకోర్టు స్పష్టం చేయడంతో సీబీఐ తర్వాత ఏం చేస్తుందన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. అయితే సీబీఐ అధికారులు సైలెంట్ గా ఉన్నారు. వారి బృందం పులివెందులలో ఉందని..కడపలో మరో బృందం ఉందని చెబుతున్నారు. కానీ ఎవరినీ ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం లేదు. అవినాష్ రెడ్డి మాత్రం గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా రోజంతా ప్రజల్లోనే ఉంటున్నారు.
అవినాష్ రెడ్డికి టెన్షనే !
సీబీఐ ఎప్పుడైనా అరెస్ట్ చేస్తుందన్న ఆందోళనతో అవినాష్ రెడ్డి ఎడతెగని విధంగా న్యాయపోరాటం చేశారు. లంచ్ మోషన్ పిటిషన్స్ దగ్గర్నుంచి అన్ని రకాల న్యాయపోరాటాన్ని చేశారు. చివరికి ఆయనకు ఎలాంటి రిలీఫ్ దక్కలేదు. అయితే సీబీఐ మాత్రం ఇంకా అరెస్ట్ చేయలేదు. ప్రజల మధ్య కనిపించకపోతే అవినాష్ రెడ్డి కనిపించడం లేదనే వార్తలు వస్తాయి. మరో వైపు సీబీఐ అధికారులు ఎప్పుడు నోటీసులు ఇస్తారో తెలియదు. అందుకే అవినాష్ రెడ్డి అత్యధిక సమయం పులివెందులలోనే గడుపుతున్నారు. సీబీఐ అధికారులు ఎప్పుడు పిలిచిన వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అరెస్టుకు కూడా మానసికంగా రెడీ అయిపోయినట్లుగానే ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని బెయిల్‌పై వచ్చేస్తారని ఆయనతో సన్నిహితంగా ఉండే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఇప్పటికే ప్రకటించారు.
అరెస్ట్ చేయాలా వద్దా అన్నది సీబీఐ చాయిస్ !
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలా లేదా అన్నది సీబీఐ ఇష్టం. ఈ మేరకు దర్యాప్తు సంస్థలకు న్యాయపరంగా ఎలాంటి ఆటంకాలు లేవు. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే జూన్ ఐదో తేదీకి వాయిదా వేసింది. సీబీఐ తన పని తాను చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ ఇస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టి వేసింది . ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం జరగలేదు పైగా సీబీఐ తన పని తాను చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అంటే సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే చేసుకోవచ్చని చెప్పినట్లయిందని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. సాంకేతికంగా న్యాయపరంగా అవినాష్ అరెస్టును అడ్డుకునే ఉత్తర్వులేమీ లేవు. అందుకే .. సీబీఐ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు..ఇక సీబీఐదే ఆలస్యం. కానీ సీబీఐ అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.
సీబీఐ వ్యూహాత్మక ఆలస్యం చేస్తోందా ?
దర్యాప్తు అధికారిని సుప్రీంకోర్టు మార్చిన తర్వాత ఒక్క సారిగా సైలెంట్ అయిన సీబీఐ..తర్వాత పంజా విసిరింది. హఠాత్తుగా వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. తర్వాత మళ్లీ ఇప్పుడు కాస్త నెమ్మదించింది. అయితే సీబీఐ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందని.. అవినాష్ రెడ్డితో పాటు ఇంకా కీలకమైన వ్యక్తుల గురించి ఆరా తీయడానికే సమయం కేటాయిస్తోందని అంటున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం లక్ష్యం కాదని అసలు వివేకా హత్య వెనుక ఏం జరిగిందో తెల్చి.. అసలు సూత్రధారుల్ని అరెస్ట్ చేయడం కీలకమని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే సీబీఐ సైలెంట్ గా తన పని తాను చేసుకున్నా చివరికి సంచలనాత్మక ముగింపు ఇస్తుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.