గుడివాడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. తెలుగు దేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటాపోటీగా రాజకీయం నడుస్తుంది ఇక్కడ. అలాంటి సమయంలో కేశినేని నాని, వంగవీటి రాధా ఫొటోలతో వెలసిన ఫ్లెక్సీలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.
కేశినేని నాని, వంగవీటి రాధా ఫొటోలతో ఉన్న బ్యానర్లు గుడివాడ రాజకీయాన్ని మరింత పీక్స్‌కు తీసుకెళ్లాయి. రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. స్థానిక తెలుగు దేశం నేత జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై వంగవీటి రాధా, కేశినేని ఫోటోలు కూడా ముద్రించారు. వీరితోపాటుగా ప్రస్తుత తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు ఫొటోలు కూడా ఉన్నాయి. ఇప్పటికే రాధా రావి యూత్ అంటూ వంగవీటి రాధాతో సాహిత్యంగా ఉంటూ వస్తున్న రావి వెంకటేశ్వరరావు... ఇటీవలే వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి రాధాతో కలిసి పాల్గొనడం తెలిసిందే. ఈసారి ఆ జోడీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని యాడ్ అయ్యారు. ఈ ముగ్గురి మధ్య ఉన్న సంబంధాలపై ఇప్పుడు హాట్ హాట్ చర్చ నడుస్తోంది.
బెజవాడ పార్టీకి దూరంగా ఉన్న కేశినేని
బెజవాడలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు పర్యటనకు వచ్చిన సమయంలో మొదటి రోజు కేశినేని నాని ముఖం కూడా చూపించ లేదు. చంద్రబాబు విజయవాడలో పర్యటిస్తుంటే కేశినేని నాని పార్లమెంట్ పరిధిలో ఉండి కూడా వేరొక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వ్యవహరం తీవ్ర స్థాయిలో చర్చకు కూడా దారి తీసింది. రెండో రోజు చంద్రబాబుతో కలసి కేశినేని నాని పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లా పర్యటనకు డుమ్మా కొట్టిన నాని ఆ తరువాత కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాల పర్యటనలో చంద్రబాబు వెంటే ఉన్నారు. తర్వాత పార్టీ నాయకులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు.
ఇప్పుడు తాజాగా గుడివాడ నియోజకవర్గంలో కేశినేని నాని ఫొటోలు తెలుగు దేశం పార్టీ కార్యక్రమాల బ్యానర్‌లపై ప్రదర్శించటం ఆ పక్కనే వంగవీటి రాధా ఫొటోలు కూడా ఉండటంపై ఏం జరుగుతుందనే ఆసక్తి రాజకీయంగా వ్యక్తం అవుతున్నాయి.
గుడివాడ పై టీడీపీ స్పెషల్ ఫోకస్...
గుడివాడపై తెలుగు దేశం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టిందనే విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇప్పటికే రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఎట్టి పరిస్థితుల్లో గుడివాడలో కొడాలి నానిని ఓడించటంమే టార్గెట్‌గా తెలుగు దేశం వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు వంగవీటి రాధా, కేశినేని నానిని రంగంలోకి దింపారేమో అనే చర్చ నడుస్తోంది. వంగవీటి రాధా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావటం, ఆ వర్గం ఓట్లు గుడివాడలో కీలకం కానుందని టీడీపీ ప్లాన్. అందుకే వంగవీటి బ్రాండ్ గుడివాడలో వర్కవుట్ అవుతుందని స్కెచ్ వేస్తోంది. దీనికి తోడుగా కేశినేని నాని వంటి కీలక నాయకుడు గుడివాడ నియోజకవర్గంపై ఫోకస్ పెడితే పార్టీ మరింతగా పుంజుకోవటం ఖాయమంటున్నారు. ఇలా చేస్తే ఎన్నికల్లో విజయం సాధించటం కష్టం కాదని తెలుగు దేశం భావిస్తోందని అంటున్నారు.
గుడివాడ, గన్నవరంతోపాటుగా విజయవాడ తూర్పు నియోజకవర్గాలపై స్పెషల్ కాన్సెంట్రేషన్ పెట్టిందని తెలుగు దేశం పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఆ మూడు నియోజకవర్గాలకు చెందిన బాద్యతలను కూడా కేశినేని నానికి అప్పగిచారనే ప్రచారం జరుగుతుంది. కేశినేని నాని పర్యటనలు వేస్తున్న అడుగులు కూడా ఆ ప్రచారాన్ని నిజం అనేలా ఉన్నాయి అంటున్నారు స్థానిక నాయకులు.