KCR Election Plan : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ప్రణాళికతో ముందుగానే అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసేశారు. కానీ కారణాలేమైనా ముందస్తుకు వెళ్లడం లేదు. అందుకే ఇప్పుడు నాలుగైదు నెలల పాటు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోందా అన్న ఆసక్తి ఏర్పడుతోంది. ఎన్నికల మూడ్ కంటిన్యూ చేయాలి. ఎన్నో సాధించామన్న అభిప్రాయాన్ని ఫ్రెష్ గా ఉంచాలి. అలాంటి టాస్క్ ఇప్పుడు బీఆర్ఎస్‌కు ముఖ్యంగా మారింది.
కళ్ల ముందు కనిపించేలా అభివృద్ధి
భారత రాష్ట్ర సమితి రెండో విడత ప్రభుత్వంలో చేయాలనుకున్న టాస్కులన్నింటినీ కేసీఆర్ పూర్తి చేసేశారు. ఇప్పుడు కేసీఆర్ పని తీరు కళ్ల ముందే ఉంది. కొత్త సచివాలయంతో తాను అనుకున్న కీలకమైన పనులు..కళ్ల ముందు కనిపించే అభివృద్ధిని కేసీఆర్ ప్రజలకు చూపించారు. అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలు జరిగాయి. హైదరాబాద్‌లో కనీసం 40 ఫ్లైఓవర్లు నిర్మించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్,టీ వర్క్స్, టీ హబ్ ప్రారంభించారు. ఒక్క సంవత్సరంలో ఒకే రోజు 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన మల్లన్న సాగర్ ను రంభించారు. నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్‌జెన్‌కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్‌ప్లాంట్‌ను శరవేగంగా నిర్మాణం అవుతోంది. 12 వందల 80 కోట్ల నిధులతో యాదాద్రిని పునర్ నిర్మించింది ప్రభుత్వం. పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ నిధులతోనే ఐటీ హబ్ మైండ్ స్పేస్ రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు నిర్మాణాలు చేస్తోంది. తాను ఏం చేశానో ఏం చేయగలనో.. కేసీఆర్ ప్రజల ముందు పెట్టినట్లయింది.
ఆరు నెలల పాటు ప్రజలను ఎన్నికల మూడ్‌లో ఎలా ఉంచుతారు ?
రాజకీయాల్లో పరిస్థితులు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఎంత అభివృద్ధి చేసి చూపించినా నాలుగు నెలలకు అతి పాతబడిపోతుంది. అప్పటి సమస్యలు హైలెట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రారంభించడానికి ఏమీ లేవు. కానీ కొత్త శంకుస్థాపనలు మాత్రం చేయవచ్చు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ఇబ్బందులు పడుతున్నా.. కేసీఆర్ వాటిని నేర్పుగా అధిగమించగలరు. ఇప్పుడు కేసీఆర్ .. ఎన్నికలకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లనుపూర్తి చేసుకున్నట్లే. మరో నాలుగు నెలల్లో ఎన్నికలని కేసీఆర్ చెబుతున్నారు. దానికి ముందుగానే ఆయన ప్రిపేర్ అయిపోయారు. ఇక పూర్తి స్థాయిలో ఎన్నికలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. వచ్చే అక్టోబర్‌లోనే ఎన్నికలని… పూర్తిగా రెడీ కావాలని పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ ప్లీనరీలో దిశానిర్దేశం చేశారు. అయితే డిసెంబర్‌లో కదా ఎన్నికలు రెండు నెలలు ముందుగానే ఎందుకు వస్తాయన్న అభిప్రాయం ఉంది. కానీ ఎమ్మెల్యేలను సన్నద్ధం చేయడానికి నిర్లక్ష్యం చేయకుండా ఉండటానికన్న అభిప్రాయం వినిపిస్తోంది.
డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు !
నిజానికి సమయం ప్రకారం జరిగినా అక్టోబర్ నెల ద్వితీయార్థంలో ఎన్నికల ప్రకటన ఉండొచ్చు. డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ ఉంటుంది. అందుకే అక్టోబర్ డెడ్ లైన్ కేసీఆర్ పెట్టారని అంటున్నారు. ఈ సారి సిట్టింగ్‌లు అందరికీ టిక్కెట్లు దక్కవని పరోక్షంగా చెప్పారు. గతంలో ఎప్పుడు కార్యవర్గ సమావేశం జరిగినా కేసీఆర్ పార్టీ నేతలందరికీ.. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఓ భరోసా ఇచ్చేవారు. సిట్టింగ్‌లు అందరికీ మళ్లీ టిక్కెట్లు ఇస్తామని.. నియోజకవర్గాలకు వెళ్లి పని చేసుకోవాలనిచెప్పేవారు. కానీ ఈ సారి టోన్ కాస్త మారింది. ఇప్పటి వరకూ కేసీఆర్ .. కేటీఆర్ చేసిన హెచ్చరికల ప్రకారం చాలా మందికి టిక్కెట్లు డౌట్ అని ప్రచారం ప్రారంభమయింది. . సర్వేల్లో అనుకూలంగా వచ్చే వారికి మాత్రమే టిక్కెట్లు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పనితీరును మార్చుకోవాలని సిట్టింగ్‌లకు సూచించారు.