Hyderabad News: బ్యాంకర్ల సమితి ఈ ఏడాది వార్షిక రుణ లక్ష్యాన్ని పెంచడంపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే 13.42 శాతం పెంచడం హర్షించదగినదని పేర్కొన్నారు. ఈ ఏడాది బ్యాంకర్లు నిర్ధారించిన రూ.2,42,775 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని బ్యాంకులకు సూచించారు. హైదరాబాద్ లోని టీ-హబ్ లో జరిగిన రాష్ట్ర బ్యాంకర్ల సమితి సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, బ్యాంకు అధికారులతో కలిసి మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. తెలంగాణ అభివృద్ధిని కొనియాడారు. దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మార్గనిర్దేశంలో రాష్ట్రం.. అనతికాలంలోనే దేశానికే మార్గదర్శిగా మారిందని కొనియాడారు. పెట్టుబడులను గణనీయంగా ఆకర్షిస్తున్నామని, ఉద్యోగ, ఉపాధి కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నామని తెలిపారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో అద్భుతమైన రీతిలో వృద్ధి సాధించినట్లు చెప్పారు.
లక్ష్యాన్ని చేరుకోవాలని బ్యాంకులకు హరీశ్ సూచన
ఈ ఏడాది నిర్ణయించిన రూ.2,42,775 కోట్ల వార్షిక రుణ లక్ష్యాన్ని బ్యాంకులు చేరుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు సూచించారు. విద్య, గృహ, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఎక్కువగా రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఆయిల్ పామ్ విస్తరణకు కూడా బ్యాంకులు రుణాలు ఇచ్చి తోడ్పాటు అందించాలని కోరారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అప్పులు ఇచ్చి, చిరు వ్యాపారులు ఎదిగేలా చూడాలన్నారు. స్వయం సహాయక బృందాల(సెల్ఫ్ హెల్ప్ గ్రూపు)కు రిజర్వ్ బ్యాంక్ నిబంధనల మేరకు వడ్డీలు వసూలు చేయాలని బ్యాంకు అధికారులను కోరారు. దేశంలోనే డిపాజిట్లలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నందువల్ల.. ఇక్కడ బ్యాంకుల బ్రాంచ్ ల సంఖ్యను పెంచితే మరింత సౌకర్యంగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు సూచించారు.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికల వల్ల దేశంలోనే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదిగిందని హరీశ్ రావు అన్నారు. దేశ జీడీపీకి తెలంగాణ అందిస్తున్న వాటా 2014-15 లో 4.1 శాతం ఉంటే, 2022-23 లో 4.8 శాతం పెరిగిందని తెలిపారు. రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంటు, మిషన్ కాకతీయ, కాళేశ్వరం సహా ఇతర సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, వ్యసాయానికి ప్రోత్సాహం, ఫిషరీస్, గొర్రెల పంపిణీ తదితర కార్యక్రమాలు రాష్ట్ర వృద్ధికి తోడ్పడినట్లు చెప్పారు.
13.42 శాతం వార్షిక రుణ లక్ష్యాన్ని పెంచిన బ్యాంకులు
2023- 24 వార్షిక రుణ లక్ష్యం రూ.2,42,775 కోట్లుగా బ్యాంకులు నిర్ధారించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.2.14 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఈ ఏడాది 13.42 శాతం వార్షిక రుణ లక్ష్యాన్ని పెంచాయి బ్యాంకులు. ఈ ఏడాది రుణ లక్ష్యంలో ప్రాధాన్యతా రంగం వాటా రూ.1,85,326.68 కోట్లుగా బ్యాంకులు నిర్ణయించాయి. దీని వాటా మొత్తం లక్ష్యంలో 76.33 శాతం. ప్రాధాన్యత రంగ లక్ష్యాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అత్యధికంగా 60.85 శాతం కేటాయించారు. అంటే రూ.1,12,763.59 కోట్లు. అలాగే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.54,672.44 కోట్లు కేటాయించారు. మొత్తం లక్ష్యంలో దీని వాటా 30 శాతం.