Telangana News: ఆ తల్లిదండ్రులు తమ కూతురికి ఘనంగా పెళ్లి చేశారు. కన్న కూతురు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోందని ఎంతో సంబరపడ్డారు. ఏడాది తిరక్కముందే తమకు మనవడో, మనవరాలో వస్తుందని.. వారితో ఆడుకుంటూ గడిపేస్తామని ఎంతో ఆశించారు. కానీ వారి ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లైన రెండు వారాలు కూడా గడవకముందే కన్న కూతురు తిరిగి రాని లోకాలను వెళ్లిపోతుందని పాపం ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. కొత్త జీవితంలో కూతురు సంతోషంగా జీవిస్తుందని సంతోషపడ్డ ఆ తల్లిదండ్రులకు తీరని శోఖాన్ని మిగిల్చింది. కాళ్ల పారాణీ ఆరకముందే ప్రాణాలు తీసుకుంది. నిన్న మొన్నటివరకూ పెళ్లికి వచ్చిన బంధుమిత్రులతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో.. ఇప్పుడు రోదనలు వినిపిస్తున్నాయి. వివాహం జరిగి 14 రోజులు గడవక ముందే పుట్టింటికి వచ్చిన నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.


ఫ్యాన్ కు ఉరివేసుకుని నవవధువు ఆత్మహత్య


మేడ్చల్ జిల్లా పేట్ బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ బాపూనగర్ కు చెందిన నవ వధువు నిషితకు ఈ నెల 5వ తేదీన మేడ్చల్ మండలం డబిల్ పురాకు చెందిన సంతోష్ రెడ్డితో పెళ్లి జరిగింది. నిన్న గురువారం అత్తింటి నుండి పుట్టింటికి వచ్చింది. కూతురు ఇంటికి రావడంతో ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. గురువారం రాత్రి ఇంట్లో చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురి వివాహం జరిగిందని సంతోషంగా ఉన్న ఆ తల్లిదండ్రులకు పుట్టేడు శోఖాన్ని మిగిల్చింది. ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతూ వారిని శోకసంద్రంలో ముంచింది. పెళ్లింట జరిగిన ఈ విషాదంతో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు.


అత్తింటి వేధింపులు భరించలేకే సూసైడ్!


అల్లుడు సంతోష్ రెడ్డి వేధింపులు భరించలేకనే తన కూతురు నిషిత సూసైడ్ చేసుకుందని ఆమె తండ్రి నర్సింహా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిషిత మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిషిత ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేట్ బషీరాబాద్ సీఐ ప్రశాంత్ తెలిపారు. 


వరంగల్‌లో వారం క్రితం యువ డాక్టర్ ఆత్మహత్య


వరంగల్ జిల్లా దుర్గొండి మండలం కేశవాపూర్ కు చెందిన గంగాధర్ రెడ్డి నగరంలోని చార్టెడ్ అకౌంటెంట్ కార్యాలయంలో పని చేస్తున్నాడు.  అయితే ఇతడికి వర్ధన్నపేట మండలం కడారిగూడేనికి చెందిన నిహారిక రెడ్డితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నం కింద నగరంలోని 300 గజాల ప్లాట్, ఇతర కానుకలు ఇచ్చారు. అయితే ఎక్సైజ్ కాలనీలో నివాసం ఉంటున్న వీరికి నాలుగు నెలల క్రితమే పాప పుట్టింది. ఇటీవల కారు కావాలని గంగాధర్ రెడ్డి అడగ్గా.. అందుకు నిహారిక తల్లిదండ్రులు అంగీకరించారు. అయినప్పటికీ పెళ్లి అప్పుడు ఇస్తామన్నా కానుకల విషయంలో ఇప్పటికీ గొడవలు జరుగుతున్నాయి. పాప పుట్టిందన్న సంతోషాన్ని కూడా ఆస్వాదించకుండా.. పుట్టింటి వాళ్లతో గొడవలు పడడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే నిహారిక అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.