PM Modi Japan Visit: 


జపాన్‌లో జీ-7 సదస్సు..


ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లో జరగనున్న G-7 సదస్సుకి హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయన హిరోషిమా చేరుకున్నారు. మే 21 వరకూ అక్కడే సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని కీలక అంశాలు చర్చించనున్నారు. ఆహార భద్రత, ఎనర్జీ సెక్యూరిటీ అంశాలపై ఆయన ప్రసంగించనున్నారు. ఇదే సమయంలో G-7 సదస్సుకి హాజరయ్యే ప్రపంచ దేశాల అధినేతలతోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఈ భేటీకి ముందు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. ముఖ్యంగా చైనాతో సరిహద్దు వివాదంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 


"చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడాలంటే సరిహద్దు వివాదం విషయంలో శాంతియుత వాతావరణం ఉండేలా చూడాలి. భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. అదే సమయంలో తన గౌరవాన్ని కాపాడుకునేందుకూ ప్రాధాన్యతనిస్తుంది. ఇక పాక్ విషయానికొస్తే..ఆ దేశంతోనూ మేం శాంతినే కోరుకుంటున్నాం. వివాదాలన్నీ సమసిపోయి సాధారణ పరిస్థితులు నెలకొనాలనే ఆశిస్తున్నాం. అలా జరగాలంటే ఆ దేశం ఉగ్రవాదాన్ని వదిలిపెట్టాలి. ఇది ఆ దేశ బాధ్యత" 


- ప్రధాని నరేంద్ర మోదీ 


రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించీ ఓ ఇంటర్వ్యూలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్‌ స్టాండ్ ఏంటని ప్రశ్నించగా...ఆసక్తికర సమాధానమిచ్చారు. "భారత్ ఎప్పుడూ శాంతి వైపే నిలబడుతుంది" అని తేల్చి చెప్పారు. ఆ రెండు దేశాల యుద్ధం కారణంగా...కొన్ని వస్తువుల ధరలు పెరిగాయని, వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటని వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్‌తో సమానంగా సంబంధాలు కొనసాగిస్తామని తెలిపారు. 










ఈ అంశాలపైనే చర్చ..


ఈ అంశాలన్నింటినీ G-7 సదస్సులో చర్చిస్తానని అన్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిద ఆహ్వానం మేరకు ప్రధాని హిరోషిమా వెళ్లారు. విదేశాంగ శాఖ సెక్రటరీ వినయ్ క్వాత్రా ఈ సమ్మిట్‌కి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. కనెక్టివిటీ, సెక్యూరిటీ, ఆర్థిక భద్రత, ప్రాంతీయ వివాదాలు, వాతావరణ మార్పులు, ఆహార భద్రత, ఆరోగ్య భద్రతతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీపైనా ప్రధాని చర్చిస్తారని తెలిపారు. మే 20వ తేదీన (రేపు) రెండు సెషన్ల పాటు మీటింగ్ జరగనుంది. ఆ తరవాత మే 21 న మరో సెషన్ మీటింగ్ జరుగుతుందని వివరించారు. ఇదే సమయంలో క్వాడ్ గ్రూప్‌లోని లీడర్లనూ ప్రధాని కలిసే అవకాశముందని క్వాత్రా తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని యాంటోని అల్బనీస్‌ కూడా హాజరు కానున్నారు. 


Also Read: