Hyderabad News: గర్భం దాల్చిన 29వ వారంలో ప్రీ ఎక్లాంప్సియాతో బాధపడుతున్న గర్భిణీకి హైదరాబాద్ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజయవంతంగా ప్రసవం చేశారు. అధిక రక్తపోటు సమస్యలు ఉన్నప్పటికీ పండంటి ఆడబిడ్డ జన్మించిందని వైద్యులు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ వైద్యులు ప్రకటించారు. తల్లీ, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు.
దవాఖానాలో గర్భిణీ విమల అడ్మిట్ అయిన తర్వాత అధిక రక్తపోటు సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఐదు రోజుల తర్వాత రక్తపోటును అదుపులోకి తీసుకొచ్చారు. అన్ని ఆరోగ్య పరిస్థితులు అనుకూలించగానే ప్రసవం చేసినట్లు గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రణతి రెడ్డి తెలిపారు. నెలలు నిండకముందే బిడ్డ జన్మించడంతో తన బరువు కేవలం 890 గ్రాములు మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు.
శ్వాసకోశ ఇబ్బందులు సహా ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఆ శిశువును ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి చికిత్స అందించారు. మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రి నియోనాటల్ కేర్ టీమ్ పర్యవేక్షణలో, ప్రత్యేక శ్రద్ధతో శిశువు బరువు కేవలం 70 రోజుల్లో 710 గ్రాముల బరువు పెరిగినట్లు నియోనాటాలజిస్ట్ డాక్టర్ దీపా డి శెట్టి, సీనియర్ శిశు వైద్యుడు డాక్టర్ కె రాజశేఖర్ తెలిపారు.