Bhatti Vikramarka: పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర ఎండలతో వడదెబ్బకు గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలంలోని రుక్కంపేట వద్ద భట్టి స్వల్ప అనారోగ్యం పాలయ్యారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన టెంట్ లోనే భట్టి విక్రమార్కకు జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పరదేశి, డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ ఆరోగ్యాన్ని పరీక్షించారు. ఎండలు తీవ్రంగా ఉండటం వందలాది కిలోమీటర్ల మేర నడుస్తుండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురైందని డాక్టర్లు తేల్చారు. వడదెబ్బకు గురయ్యారని నిర్ధారించారు. ఈ రోజు ఉద‌యం కూడా షుగ‌ర్ లెవెల్స్, బీపీ, ఫ్లూయిడ్స్ ను ప‌రీక్షించారు. వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌డం వ‌ల్ల డీ హైడ్రేష‌న్ ను గురికావ‌డంతో.. త‌గిన విశ్రాంతి త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలని.. అలాగే ఫ్లూయిడ్స్ తీసుకోవాల‌ని సూచించారు. 


48 గంటలపాటు అబ్జర్వేషన్‌లోనే భట్టి


డీహైడ్రేష‌న్ పూర్తిగా తగ్గే వ‌ర‌కూ ఎండ‌ల్లో న‌డ‌వ‌కూడ‌ద‌ని భ‌ట్టి విక్ర‌మార్క‌కు వైద్యులు సూచించారు. 48 గంటల పాటు భట్టి విక్రమార్క పూర్తిగా అబ్జర్వేషన్ అవసరం అని చెప్పారు. అంతేకాకుండా రాబోయే రెండు రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. శ‌నివారం ఉద‌యం, సాయంత్రం మరోసారి వైద్యులు భ‌ట్టి విక్ర‌మార్క‌ ఆరోగ్యాన్ని ప‌రీక్షంచ‌నున్నారు.


Also Read: ప్రాణ‌హిత- చేవెళ్ల చేప‌ట్టి ఉంటే, తెలంగాణలో తొలి మూడేళ్ల‌లోనే నీళ్లు పారేవి: భట్టి విక్రమార్క


పాదయాత్రకు రెండ్రోజులు విరామం


డాక్టర్ సూచనల మేరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు శనివారం, ఆదివారం( మే 19, 20 తేదీల్లో) విరామం ప్రకటించారు. అస్వస్థత‌కు గురైన సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్కను ప్రచార క‌మిటీ క‌న్వీన‌ర్, పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర కో ఆర్డినేట‌ర్ అజ్మతుల్లా హుస్సేన్ పరామర్శించారు. ఈ రెండు రోజుల విరామం..త‌రువాత పాద‌యాత్ర కొన‌సాగింపుపై సీఎల్పీ నేత‌తో అజ్మతుల్లా హుస్సేన్ చర్చించారు.


Also Read: Bhatti Vikramarka: 2 రోజులకే పాదయాత్ర ఆపేస్తానన్నారు, జనం అరచేతిలో పెట్టుకొని నడిపించారు: భట్టి విక్రమార్క


భారత్ జోడో యాత్రకు కొనసాగింపే పీపుల్స్ మార్చ్


కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ పాదయాత్రను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మే 16 తేదీన భట్టి పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేటలోకి ప్రవేశించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల, నాగర్ కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాల్లో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ మూడు నియోజకవర్గాల్లోని 62 గ్రామాల్లో పాదయాత్ర చేయాలని భట్టి విక్రమార్క ప్రణాళిక. మొత్తం 12 రోజుల పాటు చేయాలని ప్లాన్ వేసుకున్నారు. ప్రతీ గ్రామం వద్ద భట్టి విక్రమార్క ప్రజలతో మమేకమయ్యేలా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారు. మొత్తం మూడు చోట్ల కార్నర్ మీటింగ్ లు నిర్వహించాలని ప్లాన్.


కేంద్ర, రాష్ట్ర విధానాలతో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలుపై ప్రజలతో చర్చిస్తూ భట్టి తన పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ పాదయాత్రను సద్వినియోగం చేసుకుంటున్నారు.  మహబూబ్ నగర్ లో జరిగే పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన ఉదండాపూర్ రిజర్వాయర్ తో పాటు, వట్టెం రిజర్వాయర్లను, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని భట్టి విక్రమార్క పరిశీలిస్తారు.