Sajjala On Avinash : అవినాష్ రెడ్డి పారిపోవడం లేదని సీబీఐ విచారణకు సహకరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన అవినాష్ రెడ్డిపై మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. సీబీఐ విచారణకు హాజరయ్యేందుకే అవినాష్ రెడ్డి హైదరాబాద్ వచ్చారన్నారు. తల్లికి అనారోగ్యంగా ఉందన్న సమచారం రావడం వల్లనే ఆయన విచారణకు హాజరు కాకుండా పులివెందుల వెళ్లారని.. ఇవాళ కాకపోతే రేపైనా సీబీఐ ముందు హాజరవుతారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మీడియానే వెంటపడుతోందని ఆరోపించారు.
తాడిపత్రి నుంచి తల్లి అంబులెన్స్ తో పాటు హైదరాబాద్ కు అవినాష్ రెడ్డి
హైదరాబాద్ నుంచి పులివెందుల బయలుదేరిన ఎంపీ అవినాష్ రెడ్డి తాడిపత్రి వద్ద చుక్కలూరు సమీపంలో తల్లిని పరామర్శించారు. పులివెందుల నుంచి అంబులెన్స్‌లో హైదరాబాద్ కు అవినాష్ రెడ్డి తల్లిని తరలిస్తున్నారు. అవినాష్ రెడ్డి తన కాన్వాయ్ తో అంబులెన్స్ తో హైదరాబాద్ బయలుదేరినట్లుగా తెలుస్తోంది. అవినాష్ రెడ్డి తల్లితో పాటు జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అనుసరించారు. కర్నూలు వరకూ అవినాష్ రెడ్డిని అనుసరించినట్లుగా తెలుస్తోంది.
తల్లికి అనారోగ్యం అంటూ సీబీఐ విచారణకు రాకుండా వెళ్లిపోయిన అవినాష్ రెడ్డి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరు కాలేదు. సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు పులివెందుల నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన ఉదయం పది గంటల సమయంలో సీబీఐ విచారణకు బయలుదేరారు. అయితే అదే సమయంలో ఆయనకు పులివెందుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆయన తల్లి అనారోగ్యంతో పులివెందుల ఆస్పత్రిలో చేరారన్న సమాచారం వచ్చింది. దీంతో ఆయన సీబీఐ విచారణకు రాలేనని.. తన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో పులివెందులకు వెళ్తున్నానని సీబీఐ అధికారులకు లేఖ రాసి .. హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు. ఆయన పులివెందుల వెళ్తున్నారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే అవినాష్ రెడ్డి రాసిన లేఖ విషయంలో సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించలేదు. అవినాష్ రెడ్డి తీరుపై సీబీఐ సీరియస్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది.
మీడియా ప్రతినిధుల వాహనం పై దాడి చేయడంతో వివాదం
మరో వైపు సీబీఐ కోర్టు వద్ద అవినాష్ రెడ్డి అనచరులు మీడియా ప్రతినిధులపై దాడులు చేశారు. అవినాష్ రెడ్డి విచారణకు వస్తారని తెలియడంతో పలువురు మీడియా సంస్థల ప్రతినిధులు వచ్చారు. అక్కడకు పెద్ద ఎత్తున పులివెందుల నుంచి వచ్చిన అవినాష్ రెడ్డి అనుచరులు కూడా గుమికూడారు. అవినాష్ రెడ్డి రావడం లేదని విషయం తెలిసిన తర్వాత మీడియా కవరేజీ ఇస్తున్న వాహనాలపై దాడి చేశారు. ఓ తెలుగు మిడియా చానల్ వాహనాన్ని.. కెమెరాలను ధ్వంసం చేశారు. ఇద్దరు ప్రతినిధుల్ని కూడా గాయపరిచారు.