Karnataka Cabinet:


ఢిల్లీకి డీకే, సిద్దరామయ్య 


కర్ణాటకలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు రాజకీయాలన్నీ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే ఖర్గే, సోనియా, రాహుల్‌తో వరుసగా భేటీ అయిన డీకే శివకుమార్, సిద్దరామయ్య..ఇప్పుడు మరోసారి ఢిల్లీ వెళ్లారు. సీఎంగా సిద్దరామయ్యను, డిప్యుటీ సీఎంగా డీకే శివకుమార్‌ని సీఎల్‌పీ అధికారికంగానే ప్రకటించింది. అయితే...కేబినెట్‌లో ఎవరెవరు ఉండాలన్న విషయంలో మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ఈ బెర్త్‌ని ఫైనల్ చేసేందుకే శివకుమార్, సిద్దరామయ్య ఢిల్లీ వెళ్లారు. ఎవరెవరికి మంత్రి పదవులివ్వాలి..? ఎవరికి ఏ మినిస్ట్రీ ఇవ్వాలి అన్న అంశాలపై డిస్కస్ చేయనున్నారు. ఇప్పటికే CLP మీటింగ్‌లో ఈ చర్చ జరిగింది. సిద్దరామయ్యను లీడర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మే 20వ తేదీన సిద్దరామయ్య, డీకే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే...వీరిద్దరితో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయాలో ఇవాళ (మే 18న) తేల్చనుంది హైకమాండ్. అందుకోసమే ఇద్దరూ ఢిల్లీ బాట పట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్‌నీ ఆహ్వానించారు. ఢిల్లీలో ఖర్గేతో కీలక చర్చలు జరపనున్నారు. దీనిపై డీకే శివకుమార్ స్పందించారు. 


"నాతో పాటు సిద్దరామయ్య, రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఢిల్లీకి వెళ్తున్నాం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని కలిసి చర్చిస్తాం. ఆయన సూచనలకు అనుగుణంగా కేబినెట్‌ని విస్తరిస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే మా ఫస్ట్ ప్రియారిటీ. క్యాబినెట్‌కి సంబంధించిన ఓ విషయమైనా...దీని తరవాతే. మీకు చెప్పకుండా (మీడియాని ఉద్దేశించి) మేం ఏమీ చేయం. దీనిపై అనవసరమైన ఊహాగానాలు వద్దు. అందరం కలిసికట్టుగానే పని చేస్తాం"


- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం






అసలు సవాలు ఇప్పుడే..


సీఎం రేసులో సిద్దరామయ్య గెలిచారు. ఇక్కడి వరకూ ఓ టెన్షన్ అయితే...ఇప్పుడు అసలైన టెన్షన్ మొదలైంది. కేబినెట్‌లో ఎవరికి అవకాశమివ్వాలన్నది కాంగ్రెస్‌కి సవాలుగా మారింది. అందరికీ సమన్యాయం చేస్తూనే మంత్రివర్గ విస్తరణ చేపట్టడం అంత తేలికైన పనేం కాదు. ముఖ్యంగా ఆయా కమ్యూనిటీలని రిప్రజెంట్ చేసేలా ఓ మంత్రి తప్పకుండా ఉండాలని చూస్తోంది అధిష్ఠానం. ఇక్కడే తడబడుతున్నట్టు సమాచారం. మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. హైకమాండ్ వాళ్లకు ఆ మినిస్ట్రీ ఇవ్వకపోతే...అలకలు ఖాయం. మళ్లీ మునుపటి పరిస్థితే ఎదురవచ్చు. గెలిచిన వాళ్లు తిరుగుబావుటా ఎగరేస్తే కాంగ్రెస్‌కి కష్టాలు తప్పవు. అయితే...దీనిపై ఇప్పటికే హైకమాండ్ క్లారిటీగా ఉన్నట్టు సమాచారం. 


"జాతీయ నేతలంతా మా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. కేబినెట్ ఏర్పాటైన మొదటి రోజు నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రెడీగా ఉన్నాం"


-  డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం


Also Read: Watch Video: క్యాన్సర్‌తో పోరాటం చేసి గెలిచిన శునకం, మళ్లీ డ్యూటీలోకి కూడా దిగింది