జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ దర్శకత్వంలో టోవినో థామస్, అపర్ణ బాలమురళీ, తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘2018'. కేవలం రూ.15 కోట్లతో రూపొందించిన ఈ మలయాళం సినిమా కేవలం 10 రోజుల్లోనే  రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. మలయాళీ బాక్సాఫీస్ దగ్గర పలు సంచలనాలు సృష్టిస్తోంది.  


త్వరలో తెలుగులో విడుదల- ఆకట్టుకుంటున్న ట్రైలర్ 


కేరళలో అద్భుతం విజయం అందుకున్న ఈ సినిమా త్వరలో తెలుగులోకి విడుదలకానుంది. హిందీ, కన్నడ, తమిళంలోనూ విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన  తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ‘2018’ ట్రైలర్ విడుదల అయ్యింది. 2018లో కేరళలో భారీగా వరదలు వచ్చాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. నాటి విపత్తును ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. తమని తాము రక్షించుకుంటూనే ఎదుటివారికి ఎలా సాయం చేశారు అనే కథాంధంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఒళ్లుగగుర్పొడిచేలా రూపొందించారు మేకర్స్.






బాక్సాఫీస్ దగ్గర ‘2018’సరికొత్త రికార్డులు  


వాస్తవానికి మలయాళీ ఇండస్ట్రీలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తెరకెక్కుతాయి. తక్కువ బడ్జెట్ మంచి కాన్సెప్ట్ తో సినిమాలు రూపొందించడంలో మాలీవుడ్ మేకర్స్ కు మంచి పేరుంది. అక్కడ మంచి సక్సెస్ అందుకున్న సినిమాల రీమేక్ రైట్స్ తీసుకొని వేరే భాషల్లోకి రీమేక్ చేస్తుంటారు. తెలుగులోనూ పలు మలయాళీ రీమేక్ సినిమాలు వచ్చాయి. అద్భుత విజయాలను అందుకున్నాయి. మలయాళంలో తెరకెక్కిన సినిమాలు మంచి గుర్తింపు పొందినా, కలెక్షన్లను వసూళ్లు చేయడంలో మాత్రం ముందుండలేకపోతున్నాయి. ‘2018’ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుంది.  కేవలం రూ.15 కోట్లతో తెరకెక్కించిన ఈ మలయాళం సినిమా 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కేవళం కేరళలోనే ఈ చిత్రం రూ. 100 కోట్లు కలెక్షన్లు అందుకోవడం.. అదీ 10 రోజుల్లోనే కావడం సంచలనం కలిగిస్తోంది. మలయాళంలో ఇప్పటి వరకు రూ.100 కోట్లు సాధించిన సినిమాలు ‘లూసిఫర్’, ‘కురుప్’. అవీ ఫుల్ రన్ లో రూ. 100 కోట్లు వసూలు చేశాయి.  కానీ, ‘2018’ మాత్రం కేవలం 10 రోజుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇంకా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా ఈ సినిమా రన్ అవుతుంది. ఈ కలెక్షన్స్ రెండు, మూడు రెట్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు ట్రేడ్ వర్గాలు.  కావ్య ఫిల్మ్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.   



Read Also: రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? అదే సూపర్ స్టార్ లాస్ట్ మూవీనా?