Hyderabad News: కొత్త వారిని పనిలో పెట్టుకోవాలని అనుకుంటున్నారా.. అయితే మీలాంటి వారి కోసమే హైదరాబాద్ పోలీసులు సూచనలు చేస్తున్నారు. కొత్త వారిని పనిలో పెట్టుకోవాలనుకుంటే స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలని, వారి గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే పనిలో నియమించుకోవాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పోలీసులు ఎంత పని ఒత్తిడితో ఉన్నా తప్పకుండా సహాయం చేస్తారని అన్నారు. ఈ నెల 3వ తేదీన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వ్యాపారి ఇంట్లో ఇద్దరు మహిళలు పని చేరారు. రెండ్రోజుల తర్వాత ఇంట్లో ఉన్న వృద్ధుల కంట్లో కారం చల్లి 150 తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించారు. కేసు నమోదు చేసుకుని వెంటనే గాలింపు చేపట్టిన హైదరాబాద్ పోలీసులు 200 సీసీటీవీ కెమెరాలను విశ్లేషించి, దొంగలు పాత నేరస్తులుగా గుర్తించారు. సాంకేతికత ఆధారంగా వారిని ముంబయిలో అరెస్టు చేశారు. ఇద్దరి నుండి 120 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగతనానికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. 


ముంబయి, మహారాష్ట్ర నగర్ హాట్స్ కు చెందిన మహాదేవి రాజేశ్ కలాల్ అలియాస్ సునీత, పూజ సురేశ్ సాగత్ ఇళ్లల్లో పని చేస్తుంటారు. వీరికి నేర చరిత్ర ఉంది. అయితే ఈ నెల 2న ఎస్ఆర్ నగర్ శాంతి బాగ్ లేన్ లో నివాసం ఉంటున్న బి. రామ్ నారాయణ ఇంటికి వెళ్లిన సునీత.. ఇంట్లో పని చేస్తానని చెప్పగా వారు ఆమె గురించి ఎలాంటి వాకాబు చేయకుండా, వివరాలేవీ సేకరించకుండా ఇంట్లో పనిలో చేర్చుకున్నారు. అలాగే పూజ సురేశ్ కూడా మరొకరి ఇంటికి వెళ్లి పని చేస్తానని అడగ్గా వారు అన్ని వివరాలు అడిగారు. ఆధార్ కార్డు, గతంలో పని చేసిన వారి వివరాలు, సొంత ఊరు సహా ఇతర వివరాలు అడిగారు. ఆమె చెప్పిన సమాధానాలతో వారికి ఆమెపై నమ్మకం రాకపోవడంతో పూజ సురేశ్ ను పనిలో చేర్చుకోలేదు. ఈ క్రమంలో పూజ సురేశ్ కూడా తిరిగి సునీత పని చేస్తున్న చోటకే వచ్చేసి పనిలో కుదిరింది. పూజ సురేశ్ పనిలో చేరిన మరుసటి రోజే అంటే 3వ తేదీన ఇంట్లో వృద్ధులు మాత్రమే ఉన్నారు. ఇంట్లో ఉన్న ఆభరణాలు కూడా బయయకు కనిపిస్తుండటంతో అదే అదనుగా భావించి వారిద్దరూ ఆ వృద్ధుల కంట్లో కారం చల్లి బంగారు ఆభరణాలతో పరారయ్యారు.


ఈ దొంగతనంపై కేసు నమోదు చేసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. వారిద్దరి గురించి యజమాని వద్ద ఎలాంటి సమాచారం లేకపోవడంతో సాంకేతికతపై దృష్టి పెట్టారు. ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలికి 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 200 సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. బస్టాప్ లు, రైల్వేస్టేషన్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. పలు సీసీ కెమెరాల్లో నిందితుల ఆనవాళ్లు కనిపించాయి. వారి గురించి డేటాబేస్ లో తనిఖీ చేయగా వాళ్లిద్దరి గురించి తెలిసింది. దీంతో నిందితులు ఇద్దరిని మహారాష్ట్రలో అరెస్టు చేసి వారి వద్ద నుండి 120 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.