వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో పోలీసులు కీలక వివరాలను పేర్కొన్నారు. వైఎస్ షర్మిల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ ఆఫీసుకు వెళ్లేందుకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని చెప్పారు. సిట్ ఆఫీసుకు వెళ్లి షర్మిల ఆ కార్యాలయం ముందు ధర్నా ప్లాన్ చేసినట్లుగా తమకు తెలిసిందని చెప్పారు. ఆ నిరసనకు కూడా ఎలాంటి అనుమతి తీసుకోలేదని చెప్పారు. అందుకే శాంతి భద్రతల సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతో హౌస్ అరెస్ట్ చేయాలని నిర్ణయించినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో వివరించారు. 


‘‘ఈ క్రమంలో 10:45 గంటలకు ఇంట్లో నుండి బయటికి వచ్చి వైఎస్ షర్మిల తన వాహనంలో కూర్చుంది. మేము వాహనం చుట్టూ చేరి కారు ముందుకు కదలకుండా ఆపేందుకు ప్రయత్నించినా మాపైకి వాహనం ఎక్కించేందుకు ప్రయత్నించింది. మేం ఆపడంతో కిందకి దిగి మహిళా పోలీసులను నెట్టేసింది. వెంటనే పక్కనే ఉన్న తన ఫార్చ్యూనర్ కార్ ఎక్కింది. అక్కడా తన డ్రైవర్ బాబును రెచ్చగొట్టి మాపైకి కారు ఎక్కెలా ప్రవర్తించింది. కిందికి దిగి నాపై, లేడీ కానిస్టేబుల్స్ పై చేయి చేసుకుంది. నా చేతిలో ఉన్న హ్యాండ్ సెట్ దౌర్జన్యంగా తీసుకుంది. యూనిఫారంపై ఉన్న నేమ్ ప్లేట్ తీసుకొని కింద రోడ్ మీద పడేసింది’’ అని షర్మిల దాడి గురించి పోలీసులు ఎఫ్ఐఆర్‌లో వివరించారు.


చంచల్ గూడ మహిళా జైల్ వద్దకు చేరుకున్న విజయమ్మ


వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ చంచల్ గూడ జైలుకు వెళ్లారు. నిన్న రాత్రి కోర్టు షర్మిలకు రిమాండ్ విధించడంతో ఆమెను పోలీసులు చంచల్ గూడలోని మహిళా కారాగారానికి తరలించిన సంగతి తెలిసిందే.


ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఎందుకు ప్రశ్నిస్తుందనే విషయాన్ని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. యువతకు అన్యాయం జరిగినందున షర్మిల ప్రశ్నిస్తోందని అన్నారు. గ్రూపు ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో గళం ఎత్తుతుంటే ప్రభుత్వం అణచివేస్తుందని అన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదని ప్రభుత్వం అనుకుంటే, రేపటి నాడు ప్రజలు, యువకులే ప్రభుత్వానికి సమాధానం చెబుతారని అన్నారు. నేడో, రేపో బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు.


షర్మిలకు 14 రోజుల రిమాండ్


పోలీసులపై దాడి కేసులో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలకు కోర్టు రిమాండ్  విధించింది. ఇరువైపుల వాదనలు విన్న నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ షర్మిలకు  14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. మే 8వ తేదీ వరకు షర్మిల జ్యూడీషియల్ రిమాండ్ కొనసాగుతుంది. అంతకుముందు సోమవారం సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసులపై షర్మిల చేయి చేసుకున్నారని పోలీసులు చెప్పారు. మరో పోలీస్ ను వాహనంతో ఢీకొట్టి గాయపరిచి, నిర్లక్ష్యంగా ప్రవర్తించారని మేజిస్ట్రేట్ కు వివరించారు.


అయితే ఎలాంటి పోలీస్ వారెంట్ లేకుండా తన ఇంటి మీదకి పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చారని షర్మిల వాదనలు వినిపించారు. పోలీసులు ఎలాంటి అరెస్టు నోటీసు ఇవ్వలేదన్నారు.  పోలీసులు తనపై దురుసుగా ప్రవర్తించారని, తనను తాకే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులను నెట్టివేశానని కోర్టుకు షర్మిల తెలిపారు. అయితే షర్మిల రిమాండ్ పై వాదనలు ముగిశాక తీర్పు రిజర్వ్ చేసిన మేజిస్ట్రేట్ తాజాగా షర్మిలకు రెండు వారాలపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. నేటి మధ్యాహ్నం షర్మిలను చూసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన షర్మిల తల్లి విజయమ్మ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ పోలీసును చెంపదెబ్బ కొట్టారు.