వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ చంచల్ గూడ జైలుకు వెళ్లారు. పోలీసులపై దాడి చేశారనే కేసులో నిన్న (ఏప్రిల్ 24) రాత్రి కోర్టు షర్మిలకు రిమాండ్ విధించడంతో ఆమెను చంచల్ గూడలోని మహిళా కారాగారానికి తరలించిన సంగతి తెలిసిందే. జైలులో ఉన్న షర్మిలను విజయమ్మ పలకరించేందుకు కారాగారం లోనికి వెళ్లారు.
బయటకు వచ్చిన అనంతరం జైలు బయట వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఎందుకు ప్రశ్నిస్తుందనే విషయాన్ని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. యువతకు అన్యాయం జరిగినందున షర్మిల ప్రశ్నిస్తోందని అన్నారు. గ్రూపు ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో గళం ఎత్తుతుంటే ప్రభుత్వం అణచివేస్తుందని అన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదని ప్రభుత్వం అనుకుంటే, రేపటి నాడు ప్రజలు, యువకులే ప్రభుత్వానికి సమాధానం చెబుతారని అన్నారు. నేడో, రేపో బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
ఇలాంటి పనులకు వైఎస్ షర్మిల భయపడే రకం కాదని అన్నారు. ప్రజలకు రాజశేఖర్ రెడ్డి ఆశయాలను చేరువ చేయాలనే లక్ష్యంతో షర్మిల పోరాడుతోందని చెప్పారు. అందుకే వేలాది కిలో మీటర్ల చొప్పున పాదయాత్ర చేసిందని గుర్తు చేశారు.