Karachi Bakery Incident: కరాచీ బేకరీ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందచేయాలని సంబంధిత ఆధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కారికులు ఉన్నారని అధికారులు సీఎంకు తెలిపారు. మొత్తం గాయపడిన వారిలో 8 మందిని కంచన్ బాగ్ డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందచేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం ఆదేశాలు ఇచ్చారు.


మరోవైపు, ప్రమాదం జరిగిన వెంటనే కరాచీ బేకరీ యాజమాన్యం వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రమాదం తరువాత బేకరీ యూనిట్ లోని సిబ్బంది పత్తా లేకుండా పోయారు. ఉదయం 9 గంటలకు ప్రమాదం జరిగినా బయటికి చెప్పకుండా యాజమాన్యం జాగ్రత్త పడింది. గుట్టుచప్పుడు కాకుండా బాధితులను హాస్పిటల్ కు తరలించారు. సీఎం ఆదేశాలతో హుటాహుటిన ఘటన స్థలానికి అధికార యంత్రాంగం చేరుకుంది. అధికారులు వచ్చినా సరే షెట్టర్ మూసివేసుకొని కరాచీ సిబ్బంది వెళ్లిపోయారు. అధికారులు వారిని సంప్రదించాలని ప్రయత్నించినప్పటికీ యాజమాన్యం స్పందించలేదు.