Telangana IT Minister Sridhar Babu Serious Warning To Officials: ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మినిస్టర్‌గా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ ఉదయం 9 గంటల సమయంలో తన ఛాంబర్‌లో శాస్త్రోక్తంగా తన సీట్లు కూర్చున్నారు. అనంతరం బాధ్యతలు తీసుకున్న ఫైల్‌పై సంతకాలు చేశారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారులతో సమావేశమయ్యారు. 


తొలి సమావేశంలోనే అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు శ్రీధర్‌బాబు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసేలా లీకులు ఇస్తే మాత్రం సహించేది లేదని చెప్పేశారు. ఈ మధ్యకాలంలో ఓ కంపెనీ తెలంగాణ నుంచి వెళ్లిపోతోందని ప్రధాన మీడియాలో వార్తలు వచ్చాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలైపోయింది. 


దీంతో ప్రభుత్వం ఇలాంటి విషయంలో సీరియస్‌గా ఉండాలని చూస్తోంది. అందుకే ఇలాంటి లీకులు ఇవ్వొద్దని అధికారులకు సూచించారు శ్రీధర్‌బాబు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే పోస్టులు కానీ, తప్పుగా ప్రొజెక్టు చేసే వీలు అసలు ఇవ్వొద్దని అన్నారు. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఉపేక్షించవద్దని చెప్పారట. కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. 


హైదరాబాద్‌లో తన ప్లాంట్‌ను స్థాపించేందుకు ఆసక్తి చూపిన కార్నింగ్ సంస్థ చెన్నైకు తరలిపోతుందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయింది. దీంతో కాంగ్రెస్ వ్యతిరేకంగా పని చేసే వాళ్లంతా రెచ్చిపోయి పోస్టులు పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వచ్చిన భారీ మార్పు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చారు. దీనిపై ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ ఇప్పుడు బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్‌బాబు మాత్రం అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.