Telangana Government : తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ (Ias Officer ) స్మితా సభర్వాల్ (Smita Sabharwal), మాజీ ఐఏఎస్ ( Former Ias Officer) ఆకునూరి మురళీ (Akunuri Murali )మధ్య వివాదం రాజుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసిన స్మితా సభర్వాల్ సైలెంట్ అయిపోయారు. కొత్త ప్రభుత్వం వివిధ శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నప్పటికీ హాజరు కావడం లేదు. గత ప్రభుత్వంలో కీలక వ్యవహరించడంతోనే ఆమె సమీక్షలకు రాలేదన్న వార్తలు వచ్చాయి. అదే సమయంలో స్మితా సభర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారంటూ పుకార్లు షికారు చేశాయి.


దీనిపై మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ సీరియస్ అయ్యారు. ఆమెను కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళీ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి, కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వంకు వెళ్లి ఇక్కడి తప్పులను తప్పించుకోడం కొంత మంది ఐఏఎస్ లకు ఫ్యాషన్ అయ్యిందని ఆయన ట్వీట్ చేశారు. ఏం తప్పులు చెయ్యకపోతే ఎందుకు భుజాలు తడుముకోడం అని విమర్శించారు. దేశంలో హెలికాఫ్టర్ లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈమెగారే అంటూ ఆకునూరి మురళి స్మితా సబర్వాల్‌పై ఆరోపణలు చేశారు. 


ఒకే దెబ్బకు రెండు పిట్టలు
ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు స్మితా సభర్వాల్ కౌంటర్, క్లారిటీ ఇచ్చారు. మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళీ కామెంట్లను తన స్టైల్ లో తిప్పికొట్టారు. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌గానే విధులను నిర్వహిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నానని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా పని చేస్తానని ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో  సీఎంవోలో స్మితా సభర్వాల్‌ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 


స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని యోచిస్తున్నట్లు.. కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ, ఆమె బుధవారం ఓ ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 23 ఏళ్ల సర్వీసు చేశానని ఆమె గుర్తు చేసుకున్నారు. కొత్త ఛాలెంజ్‌లకు ఎప్పుడూ సిద్దమన్నారు. దీంతో ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లటం ఖాయమనే ప్రచారం జరిగింది. ఆమె భర్త అకున్ సబర్వాల్ కూడా ఐపీఎస్ అధికారిగా ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్నారు. దీంతో స్మితా కూడా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారని కొన్ని మీడియా ఛానెళ్లు, పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. 


స్మితా సభర్వాల్ పేరు తెలంగాణ అధికార వర్గాల్లోనే కాదు రాజకీయవర్గాల్లోనూ ఫేమస్. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవారికయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐఏఎస్ అఫీసరే అయిన ఫ్యాషనబుల్ గా తాను చెప్పాలనుకున్న విషయాలను నిర్మోహమాటంగా చెప్పేస్తారు. ప్రభుత్వం మారిన తర్వాత కొత్త సీఎంను కనీసం పరిచయం చేసుకునేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంవో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వహించారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. కొత్త ప్రభుత్వం మారిన తర్వాత స్మితా సభర్వాల్ సైలెంట్ అయిపోయారు. ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న కీలక సమీక్షలకు హాజరు కాలేదు.